రాష్ట్రంలో కొత్త కరోనా వైరస్ ప్రవేశించలేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. బ్రిటన్ నుంచి రాష్ర్టానికి వచ్చినవారిలో ఇప్పటివరకు 846 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని, వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని మంత్రి తెలిపారు. అయితే వారికి ‘బ్రిటన్ స్ట్రెయిన్’ సోకిందో లేదో ఇంకా తేలలేదని, పరీక్షల కోసం నమూనాలను సీసీఎంబీకి పంపించామన్నారు. వారు ఎవరెవరిని కలిశారో గుర్తిస్తున్నామని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కొత్త రకం కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఈటల గురువారం బీఆర్కే భవన్లో వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 8వ తేదీ నుంచి ఇప్పటివరకు బ్రిటన్ నుంచి రాష్ర్టానికి సుమారు 1,200 మంది వచ్చారని చెప్పారు. వీరందరినీ ప్రత్యేకంగా పరిశీలిస్తున్నామని, నెగెటివ్ రిపోర్ట్ వచ్చినవారి ఆరోగ్యంపైనా నిఘా ఉంచామని వెల్లడించారు. ‘బ్రిటన్ స్ట్రెయిన్’ రకం వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తిచేశారు. క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి వైడుకలను ఇంట్లోనే ఉండి జరుపుకోవాలని కోరారు. మాస్క్, భౌతికదూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు.