గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో ఉండే నవ్ఘన్ ది ఒక పేద్ద బంగ్లా.. బంగ్లా కింద నాలుగు హైఎండ్ కార్లు. ఇంటి లోపల 30 సీసీ కెమెరాలు, 360 డిగ్రీస్ నిఘా కెమెరాలు, విల్లా చుట్టూ నైట్ విజన్ కెమెరాలు. ఈ సెటప్ అంతా చూసి ఈయన గారు బిజినెస్ మ్యాన్ లేదా పొలిటికల్ లీడర్ అనుకుంటున్నారేమో.. ఇతగాడొక దొంగ.. ఆశ్చర్యంగా ఉందా.. అసలు కథ ఏంటంటే..
తొమ్మిదో తరగతి చదివిన నవ్ఘన్.. కోటీశ్వరుడు అయ్యాడు. అదీ అచ్చంగా దొంగతనాలు చేసి. ఇప్పటివరకూ దొరకలేదు కాబట్టి దొరలా బతికాడు. కానీ చేసిన నేరం ఎప్పటికైనా బయటపడకుండా ఉంటుందా. నవ్ఘన్ బండారం ఇప్పటికి బయడపడింది. ఇతడిని రెండు రోజుల క్రితం ఆనంద్ జిల్లాకు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పట్టుకుంది.
దేశ వ్యాప్తంగా 100కు పైగా భారీ నేరాలు చేసిన గజదొంగ నవ్ఘన్కు తన తండ్రి అంటే ఎంతో ప్రేమ. తండ్రి చనిపోయిన తర్వాత ఆయనకు తన గ్రామంలో ఓ గుడి కట్టాలనుకున్నాడు. దానికి అవసరమైన డబ్బు కోసం దొంగతనాలు చేయడం ప్రారంభించాడు.
నవ్ఘన్ తన భార్యతో పాటు కొందరు అనుచరుల్ని పెట్టుకుని నేరాలు చేస్తుంటాడు. పెద్ద పెద్ద విల్లాలు, బంగ్లాలనే ఎంచుకుని, తాళం వేసి ఉన్నప్పుడు అందులోకి చొరబడి పట్టపగలే చోరీలు చేస్తాడు. అలా దోచేసిన డబ్బుని దాచుకుని, బంగారాన్ని బయట అమ్మేవాడు. బంగారానికి బయట అంతగా ధర ఇవ్వకపోవడంతో.. తనే బంగారం కరిగించే కార్ఖానా ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ నగల్ని బిస్కెట్లుగా మార్చేవాడు. అలా దోపిడీ, దొంగతనాలు చేస్తూ దొరలా బతికాడు. అయితే ఇప్పటివరకూ నవ్ఘన్ తన సొంత జిల్లాలో ఒక్క దొంగతనం కూడా చేయలేదు. జైపూర్, అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరోడా లాంటి సిటీస్ ఎంచుకుని, అక్కడ టూరిస్టు లాగా ఫైవ్ స్టార్ హోటల్లో స్టే చేసి, ఒక పెద్ద దొంగతనం చేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు.
నవ్ఘన్ ఇటీవల గుజరాత్లోని ఖేడా జిల్లాలో ఉన్న స్మిత్ అండ్ సన్స్ సంస్థకు చెందిన యజమాని ఇంటిని టార్గెట్ చేసుకున్నాడు. ఇద్దరు అనుచరులతో కలిసి ఆ ఇంటి నుంచి 45 లక్షలు చోరీ చేశాడు. ఈ కేసుపై విచారించిన పోలీసులు ఆపరేషన్ చేపట్టి.. ఎట్టకేలకు నవ్ఘన్ను పట్టుకున్నారు. అలా దొరికిపోయాడు. ఆ తర్వాత జరిగిందంతా చెప్పాడు.