సాధారణంగా చాలామంది భోజనం చేసిన వెంటనే..తీరిగ్గా కునుకు తీయడం లేదా కాఫీ టీలు తాగడం, ఫ్రూట్స్ తినడం లాంటివి చేస్తుంటారు. కానీ.. ఇలాంటి పనుల వల్ల కొన్ని నష్టాలున్నాయంటున్నారు డాక్టర్లు. భోజనం అయిన వెంటనే చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటంటే…
ఫ్రూట్స్ తింటే..
భోజనం చేసిన వెంటనే ఏదైనా ఫ్రూట్ తినే అలవాటుంటుంది చాలామందికి. కానీ అలా ఫ్రూట్స్ తింటే.. శరీరం తీసుకున్న ఆహారంలోని పోషకాలను సరిగ్గా గ్రహించలేదు. అలాగే కడుపులో మరింత గ్యాస్ ఫార్మ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఒక్కోసారి దీనివల్ల పొట్టంతా గాలితో నిండి పట్టేసినట్టుంటుంది. అందుకే భోజనం తర్వాత పండు తినాలనుకుంటే భోజనం అయిన రెండు గంటల తర్వాత తినొచ్చు.

స్నానం వద్దు
భోజనానికి ముందు కాకుండా.. భోజనం తర్వాత స్నానం చేసే అలవాటుంటుంది కొంతమందికి. అయితే ఈ అలవాటు వల్ల చాలానే నష్టముంది. తిన్న వెంటనే స్నానం చేస్తే.. పొట్ట దగ్గర రక్త ప్రసరణ తగ్గి జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది. అందుకే హెల్దీగా ఉండాలంటే.. తిన్న తర్వాత కంటే.. తినే ముందే స్నానం చేసేయడం బెటర్.
వ్యాయామం చేస్తే అంతే..
కొంతమంది భోజనం చేసిన తర్వాత ఏకంగా వర్కవుట్స్ చేస్తుంటారు. ఈ అలవాటు అన్నింటికంటే ప్రమాదం. తిన్న తర్వాత వ్యాయామం చేస్తే.. తిన్నది సరిగ్గా జీర్ణమవ్వక కడుపులో వికారం, వాంతులు లాంటి సమస్యలొస్తాయి. అయితే తేలికపాటి నడకలో అంత ఇబ్బందేమీ ఉండదు. అంతగా వ్యాయామమే చేయాలనుకుంటే.. తినడానికి రెండు గంటల ముందుగానీ.. తిన్న రెండు గంటల తర్వాత కానీ.. చేయాలంటున్నారు నిపుణులు.

నిద్రొస్తే…
చాలా మందికి తిన్న తర్వాత వెంటనే ఓ కునుకు తీయాలనిపిస్తుంది. ఓ ఇరవై నిమిషాలైనా అలా పడుకుందాం అనుకుంటారు. ఇక రాత్రి పూటైతే చెప్పే పనే లేదు. తిన్న వెంటనే బెడ్ ఎక్కేసి పడుకునే వాళ్లు చాలామందే ఉంటారు. అయితే.. ఈ అలవాటు చాలా ప్రమాదకరమంటున్నారు డాక్టర్లు. తిన్న తర్వాత నిద్రపోతే అది ఒబెసిటీకి దారి తీస్తుందట. అంతకాకుండా గుండెల్లో మంట, గ్యాస్ లాంటి ఇతర సమస్యలు కూడా వచ్చే ప్రమాదముంది. అందుకే తిన్న తర్వాత పడుకోవడానికి కనీసం రెండు గంటలైనా గ్యాప్ ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

ఇవి కూడా..
వీటితోపాటు, భోజనం తర్వాత కాఫీ, టీ కూడా తాగకపోవడమే మంచిది. వాటి వల్ల కడుపులో ఎసిడటీ వచ్చే అవకాశం ఉంది.
భోజనం చేసిన వెంటనే సిగరెట్ కాల్చే అలవాటు ఉంటే దాన్ని కూడా మానుకోవడమే బెటర్. పొగాకులో ఉండే నికోటిన్ జీర్ణ క్రియను అడ్డుకుంటుంది. దీనివల్ల క్యాన్సర్ వ్యాధులు వచ్చే ప్రమాదముంది.
తిన్న వెంటనే ఈత కొట్టడం కూడా చాలా ప్రమాదకరం. దీని ద్వారా కడుపులో వికారం, వాంతులు వచ్చే అవకాశం ఎక్కువ.
ఇలా చేయాలి
భోజనం తర్వాత కొద్దిపాటి నడక లేదా కూర్చొని విశ్రాంతి తీసుకోవడం మంచిది. అలాగే భోజనం చేసిన తర్వాత కొద్దికొద్దిగా మంచినీళ్లు తాగుతూ ఉండాలి.