అత్యాచార బాధితురాలికి అండగా నిలబడి ధైర్యం చెప్పాల్సింది పోయి ఆ ఊరి పెద్దలు ఆమెను గ్రామం నుంచి బహిష్కరించారు. ఊరు విడిచి వెళ్లిపోవాల్సిందిగా ఆమె ఇంటికి నోటీసులు అంటించారు. ఆమె ఇంటి చుట్టుపక్కల వాళ్లు సైతం అత్యాచార బాధితురాలిని సూటిపోటి మాటలతో వేధించారు. చుట్టూ ఉన్న మరో రెండు గ్రామాల వారు కూడా ఆమె తమ ఊరిలోకి రావద్దని తీర్మానం చేసి పోస్టర్లు అంటించారు. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో చోటు చేసుకుంది.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన ఓ మహిళపై (30) 2015లో నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఏడాది మొదట్లో కోర్టు సదరు నిందితులకు యావజ్జీవ శిక్ష విధించింది. ఈ క్రమంలో బాధితురాలిపై గ్రామస్థులు వేధింపులకు దిగారు. ఆగస్టు 15న మూడు గ్రామాల పెద్దలు కలిసి బాధితురాలిని గ్రామ బహిష్కరణ చేస్తూ తీర్మానం చేశాయి. దిక్కుతోచని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉన్న ఊరు, ఇల్లు విడిచి తాను ఎక్కడికీ పోలేనని, న్యాయం చేయాలని వేడుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.