32.7 C
Hyderabad
Monday, March 1, 2021

విశాఖ ఉక్కు పోరు.. ఎమ్మెల్యే గంటా రాజీనామా.. చంద్రబాబు ఫైర్

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణ నిర్ణయంపై పోరు మరో మలుపు తీసుకుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌ను వ్యతిరేకిస్తూ విశాఖ నార్త్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం రాజీనామా చేశారు. సొంత దస్తూరీతో రాసిన రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణపై కేంద్రం నిర్ణయం అమలులోకి రాగానే తన రాజీనామాను ఆమోదించాలని లేఖలో అసెంబ్లీ స్పీకర్‌ను గంటా కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. ఎందరో ప్రాణ త్యాగాలతో ఆనాడు ఉక్కు కర్మాగారం సాధించామని,  ఈ వ్యవహారంపై ఏపీ సీఎం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

తుక్కు కింద కొనేసి..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. లక్షలాది మంది ఏళ్ల తరబడి ఉద్యమించి,  32 మంది ప్రాణ త్యాగంతో విశాఖ ఉక్కును సాధించుకున్నారని గుర్తుచేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ని తుక్కు కింద కొనేసి, రూ.లక్షల కోట్లు కొట్టేదామనుకుంటున్న జగన్‌రెడ్డి గ్యాంగ్‌ కుతంత్రాన్ని ప్రజల మద్దతుతో అడ్డుకుంటామన్నారు.

ఆగని నిరసనలు

విశాఖ స్టీల్ ప్లాంట్‌‌ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని, కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు విశ్రమించేది లేదని కార్మిక, ఉద్యోగ సంఘాలు తెగేసి చెబుతున్నాయి.

- Advertisement -

Latest news

Related news