ఏపీలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతోంది. తాజాగా వైసీపీ ప్రభుత్వానికి చెక్ పెడుతూ తొలివిడుత పంచాయతీల్లో ఏకగ్రీవాలపై ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ అయ్యారు. ఏకగ్రీవాలను ప్రకటించొద్దని ఆయా జిల్లాల కలెక్టర్లకు నిమ్మగడ్డ ఆదేశించారు. నిమ్మగడ్డ తాజా నిర్ణయంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డకు చిన్న మెదడు చితికిపోయినట్లు ఉందని రోజా అన్నారు. తనపై తనకు నమ్మకం లేకనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని అభిప్రాపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ ప్రజా తీర్పును గౌరవించాలని, ఏకగ్రీవాలు ప్రజల అభిప్రాయాల మేరకే జరిగాయని రోజా గుర్తు చేశారు. ఏకగ్రీవాలపై నివేదికలు ఇయ్యాలని కలెక్టర్లకు ఆదేశాలివ్వడాన్ని రోజా తప్పుబట్టారు.
ఓటు ఎలా బదిలీ చేసుకోవాలో తెలియని వ్యక్తిని ఎన్నికల కమిషనర్ గా నియమించారని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. ఏకగ్రీవం అనేది గ్రామంలోని ప్రజలే చేసుకుంటారని, దీనిని ఎస్ఈసీ ఎందుకు నిలిపివేయాలని చూస్తోందన్నారు. రాష్ట్రపతి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికలే ఏకగ్రీవం అవుతుంటే.. స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు వద్దని చెప్పడానికి ఎస్ఈసీ ఎవరని ప్రశ్నించారు.