చేతిలో ఒక గ్యాడ్జెట్ ఉంటే ఏ పని అయినా ఇట్టే అయిపోతుంది. మరి అలాంటి గ్యాడ్జెట్ చేతికే ఉంటే.. లైఫ్ మరింత స్మార్ట్‌గా మారుతుంది. వాట్సాప్ మెసేజ్ నుంచి మ్యూజిక్ ప్లేలిస్ట్ వరకూ అంతా వాచీతోనే ఆపరేట్ అయిపోతుంటే.. మొబైల్, ల్యాప్ టాప్స్‌తో పనేముందీ. అందుకే ఇప్పుడు యూత్ అంతా స్మార్ట్ వాచీలపై ఇంట్రెస్ట్ చూపుతున్నారు.
చేతికి ఒక ట్రెండీ స్మార్ట్ వాచ్ ఉంటే చాలు. పనులన్నీ ఇట్టే అయిపోతాయి. రోజుకి ఎన్ని అడుగులు నడుస్తున్నాం, పల్స్ రేట్ ఎలా ఉంది లాంటి హెల్త్ అప్ డేట్స్‌తో పాటు.. మన డిజిటల్ లైఫ్‌ను కూడా ఎప్పుడూ మనతో కనెక్ట్ చేసి ఉంచుతాయి. వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌తో పాటు వారాల పాటు బ్యాటరీ లైఫ్ ఉండడం ఈ స్మార్ట్ వాచీల స్పెషాలిటీ. మరి అలాంటి ట్రెండీ స్మార్ట్ వాచీలపై ఓ లుక్కేద్దామా..!
యాపిల్ వాచ్
యాపిల్ వాచ్ సిరీస్‌లో ఇప్పుడు వాచ్ సిరీస్ 6 నడుస్తోంది. మన దగ్గర ఐఫోన్ ఉంటే దాన్ని యాపిల్ వాచ్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. మరే ఇతర స్మార్ట్ వాచ్‌లో లేనన్ని ఫీచర్స్ యాపిల్ వాచ్‌లో ఉంటాయి. వాట్సాప్ మెసేజెస్‌కు రిప్లైస్, ఇమేజ్ గ్యాలరీ, వాచ్ ద్వారానే కాల్స్‌ను ఆన్సర్ చేయడం లాంటి ఫీచర్స్ ఇందులో ఉంటాయి. ఒకసారి వాచ్ ఫోన్‌తో కనెక్ట్ అయితే ఇక మొబైల్‌తో దాదాపుగా పని ఉండదు. ఇక వీటితో పాటు రక్తంలో ఆక్సిజన్ శాతంతో సహా.. మనకు కావాల్సిన ఫిట్నెస్ అప్డేట్స్ అన్నీ ఈ వాచ్ అందిస్తుంది. మార్కెట్లో ఉన్న స్మార్ట్ వాచీల్లో యాపిల్ వాచ్ సిరీస్ 6 నెంబర్ వన్‌గా దూసుకెళ్తుంది. దీని ధర 45 వేల వరకూ ఉంది.

శాంసంగ్ గెలాక్సీ వాచ్ 3
మార్కెట్ లో యాపిల్ కి కాంపిటీషన్ ఏదైనా ఉందంటే అది శాంసగ్ అనే చెప్పాలి. యాపిల్ వాచ్‌కు ధీటుగా శాంసంగ్ గ్యాలాక్సీ వాచ్ 3 మార్కెట్లో దూసుకెళ్తోంది. ఇది యాపిల్ వాచ్‌లా కాకుండా ట్రెడిషనల్ వాచ్ మోడల్లో రౌండ్ షేప్‌లో ఉంటుంది. ఇందులో కూడా ఫిట్నెస్ నుంచి మొబైల్ ఆపరేషన్స్ వరకూ అన్నీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. కాల్స్, మెసేజెస్, క్యాలెండర్ , వెదర్ లాంటి ఆప్షన్స్ ఇందులో ఉంటాయి. దీని ధర సుమారు 30 వేల వరకూ ఉంటుంది.

అమేజ్‌ఫిట్ జిటిఎస్ 2 మిని
బడ్జెట్ లో దొరికే స్మార్ట్ వాచ్ ఇది. దీని ధర 7వేల రూపాయల వరకూ ఉంటుంది. 14 రోజుల బ్యాటరీ లైఫ్, జిపీయస్, ఆక్సీజన్ లెవెల్, హార్ట్ రేట్, స్లీప్ అండ్ స్ట్రెస్ లెవెల్స్ లాంటివి మానిటర్ చేస్తూ.. మన ఫోన్‌తో కూడా మనల్ని కనెక్టెడ్‌గా ఉంచుతుంది. మ్యూజిక్ కంట్రోల్ , ఫైండ్ మై ఫోన్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

రియల్ మి వాచ్
రియల్ మీ కూడా మరింత బడ్జెట్లో స్మార్ట్ వాచీని అందుబాటులోకి తీసుకొచ్చింది. రక్తంలో ఆక్సిజన్ శాతంతో సహా అన్ని ఫిట్నెస్ మెజర్మెంట్స్తో పాటు.. కాల్స్, మెసేజెస్, మ్యూజిక్ ప్లేయర్ లాంటి కనెక్టివిటీ ఫీచర్లను కూడా అందిస్తుంది. తొమ్మిది రోజుల బ్యాటరీ లైఫ్ కలిగి ఉండే ఈ వాచీ ధర 4 వేల రూపాయల లోపే.

బోట్ స్టోర్మ్
మార్కెట్లో అన్నింటికంటే తక్కువ ధరకు లభించే స్మార్ట్ వాచ్ బోట్ స్టోర్మ్. ఏ ఒక్క ఫీచర్ మిస్ అవ్వకుండా బేసిక్ స్మార్ట్ వాచ్‌లో ఉండాల్సిన ఫీచర్లన్నీ ఇందులో ఉంటాయి. ఫిట్నెస్ ట్రాకింగ్, ఫోన్ కనెక్టివిటీతో పాటు వాటర్ రెసిస్టెంట్‌ను కూడా కలిగి ఉంది. దీని ధర 2500 వరకూ ఉంది.

త్వరలో వన్ ప్లస్ బ్యాండ్
అన్ని బ్రాండ్లతో పాటే వన్ ప్లస్ కూడా ఫిట్నెస్ బ్యాండ్ ను మనదేశంలో రిలీజ్ చేయనుంది. ఇందులో హార్ట్ రేట్, ఎస్పీఓ2, స్లీప్ ట్రాకింగ్ లాంటి అన్ని ఫిట్నెస్ ఫీచర్లు ఉంటాయి. దీని ధర మూడు వేల రూపాయలు ఉండే అవకాశం ఉంది.