21.4 C
Hyderabad
Friday, December 4, 2020

అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ గుడ్ బై

భారత క్రికెట్‌ గతిని మార్చి.. కోట్ల మందికి ఆదర్శంగా నిలిచిన డైనమైట్‌ మహేంద్రసింగ్ ధోని. అర్జునుడి రథానికి కృష్ణుడిలా.. అతిరథ మహారథుల బృందానికి నాయకుడిగా విజయాలందించిన మహేంద్రుడు ఆకస్మికంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా  ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌ బై చెబుతున్నట్టు ధోని ప్రకటించాడు. అండగా నిలిచిన అభిమానులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు తెలిపాడు. 19:29 గంటల నుంచి తాను క్రికెట్  కు వీడ్కోలు పలికినట్టుగా భావించండి అంటూ..ధోని ఓ వీడియో‌ను షేర్ చేశాడు.

39 ఏళ్ల మహేంద్రసింగ్‌ ధోనీ..తన క్రికెట్ కెరియర్ లో ఎన్నో రికార్డులు నమోదు చేశాడు. ప్రపంచ క్రికెట్‌లో భారత జట్టును నెంబర్‌ వన్‌ స్థానానికి చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. 2004, డిసెంబర్‌ 23న బంగ్లాదేశ్‌తో వన్డే ద్వారా ధోని అరంగ్రేటం చేశాడు. అయితే ఆ మ్యాచ్‌లో ధోని డౌకట్ అయ్యాడు. ఇక 2005లో శ్రీలంకతో మ్యాచ్‌లో ధోని టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.  2006లో తొలిసారి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడాడు. 2014లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. ధోని చివరి సారిగా 2019, జులై 19న  ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు. తన 16 ఏండ్ల క్రికెట్ కెరియర్ లో ధోని 90 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడి..4వేల 876 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధశతకాలు ఉన్నాయి. ఇక 350 వన్డే మ్యాచ్‌ల్లో 10 వేల 773 రన్స్‌ చేశాడు. వీటిల్లో 10 శతకాలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183‌.ఇక 98 టీ-20 మ్యాచ్‌లలో 1600 పరుగులు సాధించాడు. బ్యాట్స్‌ మెన్‌ గానే కాకుండా ధోని వరల్డ్ క్రికెట్ లో బెస్ట్ వికెట్‌ కీపర్‌ గా నిలిచాడు. మూడు ఫార్మాట్లో కలిపి 538 మ్యాచ్‌ల్లో కీపింగ్ చేసిన ధోనీ 195 స్టంపౌట్లతో రికార్డు సృష్టించాడు. మొత్తం 829 ఔట్లలో పాలుపంచుకున్న మహీ.. వరల్డ్ బెస్ట్ కీపర్లలో ఒకడిగా  నిలిచాడు. ఇందులో 195 స్టంపౌట్లు, 634 క్యాచ్‌లు ఉన్నాయి. మరే భారత వికెట్ కీపర్ కనీసం 500 ఔట్ల మార్క్‌ ను కూడా అందుకోలేకపోయారు. ధోనీ కీపింగ్ సగటు.. 1.363 కావడం విశేషం.

ఆటగాడిగానే కాదు… సారథిగా టీమిండియాను శిఖరస్థాయిలో నిలబెట్టాడు ధోని. 2007 టీ-20 వరల్డ్ కప్ విజయం ధోని కెప్టెన్ కెరియర్ కు తొలిమెట్టు అని చెప్పుకోవచ్చు. అనుభవం లేని ఆటగాళ్ల నుండి అద్భుతమైన ఆటను రాబట్టుకుని ధోని కెప్టెన్ గా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. లీగ్ దశలో కాస్త తడబడినా మెయిన్ మ్యాచుల్లో ఓటమన్నదే ఎరగకుండా ధోని సేన మొదటి టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని అందుకుని చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా ఫైనల్లో పాక్ పై విజయం చిరస్మరణీయమైంది. చివరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ధోని కెప్టెన్సీ అద్భుతం. క్లిష్ట పరిస్థితుల్లో ధోని యువ బౌలర్ జోగిందర్ సింగ్ పై నమ్మకాన్ని ఉంచి అతనికి బంతి అందించడం సాహసమనే చెప్పాలి. ఆ నమ్మకమే అతడిని డాషింగ్ కెప్టెన్ ని చేసింది.

క్రికెట్ ప్రపంచంలో తనదైన సారథ్యంతో గొప్ప కెప్టెన్‌గా గుర్తింపు పొందిన ఈ రాంచీ డైనమైట్.. ఎవరికీ సాధ్యం కానీ అరుదైన ఘనతను తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. యువ క్రికెటర్‌గానే 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన మహీ..2013 ఛాంపియన్ ట్రోఫిలోనూ జట్టును విజేతగా నిలిపాడు. ఇక  మూడు దశాబ్దాలుగా ఊరించిన ప్రపంచకప్‌ను 2011లో అందించి యావత్ భారతాన్ని ఉప్పొంగేలా చేశాడు. లంకతో జరిగిన ఫైనల్లో 91 పరుగులు సాధించి..సిక్సర్ తో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపాడు.. 28 ఏళ్ల తర్వాత భారత ప్రపంచ కప్ కలను నెరవేర్చాడు. క్రికెట్ చరిత్రలో సిక్సర్‌తో ప్రపంచకప్ అందించిన ఏకైక ఆటగాడు ధోనీనే కావడం విశేషం. దీంతో ఐసీసీ టైటిళ్లన్నీ గెలిచిన ఏకైక సారథిగా చరిత్రకెక్కాడు.

ఇక క్రికెట్ చరిత్రలోనే అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ఘనతను ధోనీ అందుకున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 332 మ్యాచ్‌లకు మహీ కెప్టెన్సీ వహించాడు. ధోనీ తర్వాతి స్థానంలో 324 మ్యాచ్ లతో ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ ఉన్నాడు. అలాగే  భారత్ తరఫున అత్యధిక విజయాలందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీయే కావడం విశేషం. మూడు ఫార్మాట్లలో కలిపి 332 మ్యాచ్‌ల్లో 178 విజయాలందించాడు. అంతేకాకుండా భారత క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వన్డేలకు సారథ్యం వహించిన ఘనతను అందుకున్నాడు. పవర్ హిట్టర్‌గా అభిమానులకు సుపరిచితమైన ధోనీ.. అలవోక సిక్సర్లతో అలరించేవాడు. హెలికాఫ్టర్ షాట్‌ను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసిన మహీ వన్డేల్లో ఇప్పటి వరకు 204 సిక్స్‌ లు బాదాడు. దీంతో అత్యధిక సిక్స్‌ లు బాదిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు.

అటు ఐపీఎల్‌లోనూ మహేంద్రుడి హవా కొనసాగింది. అతడి కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ మూడు టైటిల్స్ అందుకుంది. చాంపియన్స్ లీగ్‌లోరెండు సార్లు విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో 174 మ్యాచ్‌ల్లో ధోనీ నేతృత్వంలోని చెన్నై 104 విజయాలందుకుంది. ఫలితంగా అత్యధిక విజయాలందించిన కెప్టెన్‌గా ధోనీకి ఘనత దక్కింది.

మహీ కెరీర్‌లో 2019 వరల్డ్‌ కప్ ఓ చేదు జ్ఞాపకం. న్యూజిలాండ్‌తో సెమీస్‌లో రనౌటై భారత్‌ను గెలిపించలేకపోయాడు. ఆ మెగా టోర్నీ తర్వాత ఆటకు మహీ దూరం అయ్యాడు. అయితే ఐపీఎల్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొని ఆశలు రేకెత్తించిన మహీ..టీ-20 వరల్డ్ కప్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ ఆడతాడని అంతా భావించారు. కానీ కరోనా కారణంగా టీ-20 వరల్డ్ కప్ వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో..ధోని అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఏదీ ఏమైనా భారత క్రికెట్ చరిత్రలో ధోనిది చెరపలేని చరిత్ర.. చెరిగిపోని యాత్ర.. మరెవరినీ ఊహించలేని పాత్ర.

 

- Advertisement -

Latest news

Related news

ఫ్రంట్ లైన్ సిబ్బంది.. డేటాబేస్ రెడీ చేయండి : సీఎస్ సోమేష్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు , పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది వివరాలతో కూడిన డేటా బేస్...

కేంద్ర ప్రభుత్వం భోజనాన్ని తిరస్కరించిన రైతులు

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులను గురువారం కేంద్ర ప్రభుత్వం రెండో విడత చర్చలకు పిలిచింది. ఢిల్లీ విజ్ఞాన కేంద్రంలో కేంద్రమంత్రులు పీయూష్‌...

త్వరలో వరంగల్లో ఎలక్ట్రిక్ బస్సులు

ప్రస్తుతం హైదరాబాద్‌లో 40 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వరంగల్‌ లో కూడా బ్యాటరీ బస్సులు నడిపించాలనుకున్నా సమ్మె, కరోనా కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా కేంద్రప్రభుత్వ గైడ్‌లైన్స్‌ మేరకు...

ఆ అబ్బాయి ఎన్నికల విధులకు రాలేదు : ఈసీ

17 సంవత్సరాల బాలుడిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇప్పారు. ఆ వార్తల్లో నిజం లేదని సదరు...