వరుస విజయాలతో దూసుకెళ్తోన్న రాజస్థాన్ రాయల్స్ జోరుకు కోల్‌కతా నైట్ రైడర్స్ అడ్డుకట్ట వేసింది. బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించి పోరాడే స్కోరును బోర్డుపై ఉంచిన కేకేఆర్.. ఆపై బౌలింగ్‌లో ఇరగదీసింది. బ్యాటింగ్ లైనప్‌లో పటిష్టంగా ఉన్న రాజస్తాన్‌ను 137 పరుగులకే కట్టడి చేసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కోల్‌కతా నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ 20ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులు చేసింది. బ్యాటింగ్ వైఫల్యంతో స్టీవ్ స్మిత్ సేన ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నది.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది. యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ 47 పరుగులు చేసి ఆరంభంలో రాణించగా ఆఖర్లో ఇయాన్ మోర్గాన్ 34 పరుగులతో విజృంభించి జట్టుకు పోరాడే స్కోరు అందించారు. స్టార్ ఆల్ రౌండర్ జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు పడకొట్టి.. అత్యద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ కోల్‌కతా బ్యాట్స్ మెన్‌ను కట్టడి చేశాడు.
లక్ష్య ఛేదనలో బరిలో దిగిన రాజస్థాన్‌కు ఆరంభం నుంచి వికెట్లు కోల్పోయింది. కోల్‌కతా పేసర్లు పదునైన బంతులతో టాపార్డర్‌ను కుప్పకూల్చారు. ఓపెనర్ స్టీవ్ స్మిత్ 3 పరుగులకే ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కేకేఆర్ కీపర్ దినేశ్ కార్తీక్ అద్భుతమైన క్యాచ్‌తో స్మిత్ పెవిలియన్‌కు చేరాడు. అనంతరం సంజూ శాంసన్ 8 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఆపై జోస్ బట్టర్21, రాబిన్ ఊతప్ప2లు స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో రాజస్తాన్ కష్టాల్లో పడింది. రాజస్తాన్ 66 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోవడంతో తేరుకోలేకపోయింది. కాగా, టామ్ కరాన్ చివరి వరకూ క్రీజ్‌లో ఉండి మెరుపులు మెరిపించినా ఎనిమిది మంది సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో ఘోర ఓటమి తప్పలేదు.