రాజస్థాన్ రాయల్స్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ 223 పరుగులు చేసి, 224 రన్స్ టార్గెట్ ఇచ్చినా విజయవంతంగా ఛేదించింది. ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే 226 పరుగులు చేసి అద్భుత విజయం సాధించింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కింగ్స్ పంజాబ్ కు ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్‌లు అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ మెరుపులు మెరిపించారు. ఈ క్రమంలోనే తొలుత మయాంక్ హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై రాహుల్ అర్థ శతకం సాధించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 183 పరుగులు జోడించారు. 50 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్‌లతో 106 పరుగులు చేసిన తర్వాత మయాంక్.. తొలి వికెట్‌గా ఔటయ్యాడు. అటు రాజ్‌పుత్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ కూడా పెవిలియన్ చేరాడు. 54 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్ తో 69 పరుగులు సాధించిన తర్వాత రాహుల్ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఇక చివర్లో మ్యాక్స్ వెల్, పూరన్ లు ధాటిగా ఆడటంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 223 పరుగుల భారీ స్కోర్ చేసింది.
224 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ మూడో ఓవర్లోనే ఫస్ట్ వికెట్‌ను కోల్పోయింది. కాట్రెల్ వేసిన బంతిని ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వెనుదిరిగాడు బట్లర్. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సంజూ శాంసన్ భారీ షాట్స్ ఆడాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్ ఇద్దరూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. పవర్ ప్లే పూర్తయ్యే సమయానికి రాజస్థాన్ రాయల్స్ ఒక వికెట్ కోల్పోయి 69 పరుగులు చేసింది. అయితే, జట్టు స్కోర్ 100 పరుగుల దగ్గర ఉన్నప్పుడు 27 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ లతో 50 పరుగులు చేసిన స్మిత్ ఔటయ్యాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రాహుల్ తివాతియా మొదట చాలా మెల్లగా ఆడాడు. కొద్దిసేపు స్కోరు బోర్డు నత్తనడకను తలపించింది. అయితే 15 ఓవర్ తర్వాత సంజూ శాంసన్ స్ట్రైకింగ్ ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించాడు. 16వ ఓవర్లో మూడు సిక్స్ లు కొట్టాడు. తరువాత 17వ ఓవర్ ఫస్ట్ బంతికే 85 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సంజూ శాంసన్ ఔట్ అయ్యాడు.
సంజూ శాంసన్ ఔట్ అయిన తర్వాత రాహుల్ తివాతియా చెలరేగాడు. కాట్రెల్ వేసిన 18వ ఓవర్లో 5 సిక్స్ లు కొట్టాడు. ఆ ఓవర్లో మొత్తం 30 పరుగులు వచ్చాయి. షమీ బౌలింగ్‌లో రాబిన్ ఊతప్ప ఔట్ కావడంతో రాజస్థాన్ 4వ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత తివాతియా కూడా షమీ బౌలింగ్ లోనే ఔట్ అయ్యాడు. ఇక ఆరు బంతుల్లో కేవలం రెండుపరుగులు చేస్తే గెలిచే అవకాశం ఉన్న సమయంలో 20వ ఓవర్లో రెండో బంతికి పరాగ్ ఔట్ అయ్యాడు. అనంతరం కరణ్ ఫోర్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు.