టీమిండియా క్రికెటర్ల ఫిట్నెస్ని మరింత పెంచేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఆటగాళ్ల ఎంపికకు మరో కొత్త టెస్టు ‘టైమ్ ట్రయల్ టెస్ట్’ను తీసుకువస్తోంది. ఇప్పటి వరకు టీంఇండియా ఆటగాళ్ల ఎంపికకు యో-యో టెస్ట్ ను ప్రామాణికంగా భావిస్తున్నారు. ఇకపై దీనితోపాటు 2 కిలో మీటర్ల దూరాన్ని కేవలం 8 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి, జూన్, సెప్టెంబరు నెలల్లో పెట్టే ఈ టెస్టుల్లో బీసీసీఐ కాంట్రాక్ట్ ఆటగాళ్లు, జట్టులో కొత్తగా చోటు కోసం పోటీ పడుతున్న వారు వీటిని క్లియర్ చేయాల్సిందే. టైమ్ ట్రయల్ టెస్ట్ తో మరింత మెరుగైన ఫిట్నెస్ను సాధించేందుకు సహాయపడుతుందని బీసీసీఐ భావిస్తుంది.
ఎంపిక మరింత కఠినం
ఇండియా తరపున ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ఆడాలంటే యో-యో ఫిట్నెస్ టెస్టులో ఓ క్రికెటర్ 17.1 పాయింట్లు సాధించాలి. దీంతోపాటు కొత్త టెస్ట్ లో భాగంగా.. ఓ ఫాస్ట్ బౌలర్ 2 కి.మీ. దూరాన్ని 8 నిమిషాల 15 సెకన్లలో పూర్తి చేయాలి. అదే ఓ బ్యాట్స్ మెన్ అయితే 8 నిమిషాల 30 సెకన్లలో పరుగు తీయాల్సి ఉంటుంది.