ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో తొలిసారిగా రూ.150 కోట్ల క్లబ్బులో చేరే క్రికెటర్గా ఎంఎస్ ధోని నిలవడం లాంఛనమే. ఎందుకంటే 2021లోలోనూ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)కు ధోని నాయకత్వం వహిస్తాడని సీఎస్కే సీఈఓ కాశి విశ్వనాథన్ ఇప్పటికే ధృవీకరించారు. 2020లో సీఎస్కే మేనేజ్మెంట్ ధోనికి రూ.15కోట్లు చెల్లించింది. దీంతో ఐపీఎల్ లో ఇప్పటివరకు ధోని రూ.137.8 కోట్లు సంపాందించాడు. ఇక 2021 సీజన్ ఆడేస్తే ధోని సంపాదన రూ.150 కోట్ల మార్కును దాటేస్తాడు. ఐపీఎల్ ద్వారా రూ.150 కోట్లకు పైగా సంపాదించిన తొలి ఆటగాడుగా ధోని నిలుస్తాడు. ధోని తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ(రూ.131.6 కోట్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ(రూ.126.2 కోట్లు) నిలుస్తారు.