కోట్లాది మంది మనసులు గెలిచిన క్రికెట్ వన్డే ఫార్మాట్ ఎలా ప్రారంభమై జనవరి 5తో 50 ఏండ్లు పూర్తి చేసుకుంది. అసలు వన్డే ఫార్మాట్ ప్రారంభమే అనుహ్యంగా ప్రారంభమైంది. టెస్టులకు పరిమితమై గంటల కొద్ది క్రీజుల్లో పాతుకుపోయేందుకు అలవాటు పడ్డ క్రికెటర్లు పరిమిత ఓవర్ల ఆటకు అలవాటు పడేందుకు చాలా సమయం పట్టింది. కానీ ప్రేక్షకులు మాత్రం పరిమిత ఓవర్ల ఆటకు బ్రహ్మరథం పట్టడంతో వన్డే ఫార్మాట్ జనరంజకంగా మారింది.
50 ఏండ్ల క్రితం..
క్రికెట్లో వన్డే ఫార్మాట్ ప్లాన్ చేసి అమలు చేసింది కాదు. 50 ఏండ్ల క్రితం అంటే జనవరి 5, 1971న ఇంగ్లండ్ – ఆస్ట్రేలియా మధ్య వర్షం వల్ల టెస్టు రద్దయిన పరిస్థితుల్లో వచ్చిన ఆలోచన ఫలితం. యాషెస్ సిరీస్‌లో భాగంగా 1970 డిసెంబర్ 31 నుంచి 1971 జనవరి 4 వరకు.. మెల్బోర్న్ వేదికగా మూడో టెస్టు జరగాల్సి ఉంది. అయితే వర్షం వల్ల తొలి మూడు రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయింది. ఒకవేళ ఈ టెస్టు పూర్తిగా రద్దయితే భారీ నష్టం తప్పదని భావించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. అదనపు టెస్టు కోసం ఇంగ్లండ్‌ను కోరింది. అప్పటికే వాతావరణం మెరుగుపడినా.. రెండు రోజుల ఆటతో అభిమానులు నిరాశ పడతారని బోర్డులు భావించాయి. దీంతో ఒకో జట్టుకు 40 ఓవర్లు.. ప్రతి ఓవర్లో 8 బంతులు కేటాయించి.. ఎక్కువ పరుగులు చేసిన టీమ్‌ను విజేతగా ప్రకటించాలన్న నిర్ణయానికి వచ్చాయి. ఆ ఆలోచనతోనే వన్డే క్రికెట్ ప్రారంభమైంది.
ఆస్ట్రేలియాదే తొలి వన్డే
ఇలా తొలిసారి నిర్వహించిన పరిమిత ఓవర్లు(వన్డే) మ్యాచ్ కు 20 వేల మంది ప్రేక్షకులు హాజరువుతారని భావిస్తే ఏకంగా 46 వేల మంది వచ్చారు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 39.4 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. జాన్ ఎడ్రిచ్ 82 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. 34.6 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఇయాన్ చాపెల్ 60, డగ్ వాల్టెర్స్ 41 పరుగులతో రాణించారు. మొదటిసారిగా దాదాపు 50 వేల మంది ప్రేక్షకుల ఎదుట తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియ గెలిచి చరిత్ర సృష్టించింది. ఇలా అనుకోకుండా మొదలైన వన్డే ఫార్మాట్.. ఐదు దశాబ్దాలుగా ప్రజలను ఆకట్టుకుంటోంది.