29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

వసీం జాఫర్‌కు మాజీల మద్దతు

సెలక్టర్లు, సంఘం కార్యదర్శి పక్షపాతం కారణంగా అనర్హులు ఉత్తరాఖండ్ జట్టులోకి ఎంపికవుతున్నారని ఆరోపిస్తూ ఉత్తరాఖండ్ కోచ్, టీంఇండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్‌ మంగళవారం కోచ్‌ పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే కోచ్‌గా ఉన్నప్పుడు జట్టు ఎంపికలో ఓ మతానికి చెందిన ఆటగాళ్లకు జాఫర్ ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రయత్నించినట్లు ఉత్తరాఖండ్ రాష్ట్ర క్రికెట్‌ సంఘం అధికారులు ఆరోపణలు చేశారు. అయితే ‘ఉత్తరాఖండ్ క్రికెట్ టీమ్ కోచ్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం స‌రైన‌దే. కాకపోతే ప్లేయ‌ర్స్ నీ కోచింగ్‌ను మిస్ అవుతారు.’ అంటూ టీంఇండియా మాజీ ప్లేయర్ అనిల్ కుంబ్లే జాఫర్ కి మద్దతుగా నిలిచాడు. ‘నువ్వు ఇలా వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి రావ‌డం దుర‌దృష్టక‌రం’ అని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ ట్వీట్ చేశాడు.

తాజాగా తనపై వచ్చిన ఆరోపణలపై వసీం ట్విటర్లో స్పందించాడు. ‘క్రికెట్లోకి మతాన్ని తేవడం బాధాకరం. ఇక్బాల్‌ అబ్దుల్లాను కెప్టెన్‌ చేయాలని నేను చెప్పడం అబద్ధం. జై బిస్టా కెప్లెన్ చేయాలని నేను సిఫార్సు చేశాను. సెలక్టర్లంతా ఇక్బాల్ కు మద్దతు పలికారు. జట్టులో సీనియర్ ఆటగాడు పైగా ఐపీఎల్ ఆడిన అనుభవం ఉందికదా అని నేనూ సరే అన్నాను.’ అని వసీం చెప్పుకొచ్చాడు. ‘బయో బబూల్లోకి మత గురువును తెచ్చారన్నది కూడా అబద్ధమే. శుక్రవారం ప్రార్థనల కోసం ఇక్బాల్‌ అబ్దుల్లా నాతో పాటు మేనేజర్‌ అనుమతి తీసుకున్నం. దీన్ని ఎందకు పెద్ద విషయంగా చేస్తున్నారో అర్థం కావడం లేదు.’ అంటూ వసీం జాఫర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

టీమిండియా తరపున 31 టెస్టులు ఆడిన వసీం 1944 పరుగులు చేశారు. ఇందులో ఐదు శతకాలు, 11 అర్ధ శతకాలు ఉన్నాయి. 1996-97 సీజన్‌లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో అరంగేట్రం చేసిన జాఫర్‌.. మొత్తం 260 మ్యాచ్‌లు ఆడి 19410 పరుగులు బాదారు. అందులో 57 శతకాలు, 91 అర్ధ శతకాలు ఉన్నాయి. రంజీలో ముంబై, విదర్భ టీంల తరపున ఆడాడు.

- Advertisement -

Latest news

Related news