32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

కంగారుల గడ్డపై చరిత్రాత్మక విజయానికి పునాది వేసిన ఒక ఓటమి

ఒక అవమానకర ఓటమి… చరిత్రాత్మక విజయానికి పునాది వేస్తుందా..? ఎన్ని ఆటంకాలు ఎదురైనా అలుపెరగక పోరాడితే అసాధ్యమన్నది ఉంటుందా..? ఆసీస్‌ గడ్డపై టీమ్‌ఇండియా లిఖించిన కొత్త చరిత్రే ఇందుకు సమాధానం..!

శతాబ్దాల టెస్టు క్రికెట్ చరిత్రలో కంగారూ గడ్డపై టీమ్‌ఇండియా చిరస్మరణీయమైన విజయాన్ని సాధించింది. భారత క్రికెట్ చరిత్రలోనే ఇదొక సువర్ణాధ్యాయం. ప్రపంచ క్రికెట్‌లో మొండిపోరాటానికి దక్కిన అద్భుత గౌరవమిది. 88 ఏండ్ల భారత క్రికెట్‌ చరిత్రలో ప్రతి అభిమాని సగర్వంగా గుర్తుంచుకునే రోజిది! మువ్వన్నెల పతాకం మురిసిపోయే అద్భుత విజయమిది. అంకెల పరంగా… గణాంకాల పరంగా… పరుగులు… వికెట్ల పరంగా… ఈ విజయాన్ని కొలవలేము. అద్వితీయం… అపూర్వం… అపురూపం… ఇవి సరిపోవు.

టీమ్‌ఇండియా మొండిపోరాటాన్ని అభివర్ణించేందుకు ఈ పదాలను మించినదేదో కావాలి. అడిలైడ్‌లో తొలి టెస్టులోనే 32 పరుగులకు ఆలౌట్. సిరీస్ ఆరంభంలోనే అవమానకర ఓటమి. వరల్డ్ నెంబర్‌ వన్‌ ప్లేయర్… సారథి కోహ్లి జట్టుకు దూరమయ్యాడు. ఈ పరిస్థితుల్లో మెల్‌బోర్న్ టెస్టు నుంచి రహానే సారథ్యంలో భారత్‌ సాగించిన పోరాటం అసాధారణం. అందుకు ఆసీస్‌ గడ్డపై వరుసగా రెండోసారి టెస్టు సిరీస్‌ విజయం టీమ్‌ఇండియాను వరించింది.

అవమానకర ఓటమితో మొదలైన భారత్‌ పయనం… ఆసాంతం ఆటంకాలతోనే సాగింది. గాయాలు వెంటాడిన ఈ సిరీస్‌లో భారత ఆటగాళ్లు సమిష్టిగా పోరాడిన వైనం చరిత్రలో నిలిచిపోయింది. ఇన్నేండ్ల క్రికెట్ చరిత్రలో ఇంతగా గాయాలతో ఇబ్బంది పడిని జట్టేది ఉండదేమో. ఒకరు కాదు ఇద్దరు కాదు… గాయపడిన ఆటగాళ్లతో ఒక క్రికెట్ జట్టే తయారవుతుంది. సిరీస్ ఆరంభంలోనే షమీతో మొదలైన గాయాల పర్వం చివరిదాకా కొనసాగింది.

వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్‌ మెన్‌ గైర్హాజరీ… వరల్డ్ నెంబర్‌ వన్ బౌలర్‌ బుమ్రా దూరమయ్యాడు. సిడ్నీ టెస్టులో అద్భుతంగా పోరాడిన రవిచంద్రన్ అశ్విన్, విహారి సైతం గాయాలతో దూరమయ్యారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గబ్బాటెస్టులో అడుగు పెట్టిన రహానే సేన… అద్భుతం చేసింది. యావత్ క్రికెట్ ప్రపంచాన్ని అబ్బురపరిచింది. ప్రతి భారతీయ క్రికెట్ అభిమాని మీసం మెలేసేలా సత్తా చాటింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన గబ్బా టెస్టులో పోరాడితే పోయేదేమీ లేదన్నట్టుగా ఆడింది. రెండో ఇన్నింగ్స్‌ లో ఆసీస్ విధించిన 328 పరుగుల లక్ష్యాన్ని సాధించి ఔరా అనిపించింది. బ్రిస్బేన్ టెస్టులో 3 వికెట్ల తేడాతో కంగారూలను ఖంగు తినిపించి… బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సగర్వంగా ముద్దాడింది.

గబ్బా టెస్టు విజయంతో ఆసీస్‌ గడ్డపై టీమ్‌ఇండియా వరుసగా రెండోసారి సిరీస్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో చెలరేగిన రిషభ్ పంత్‌ ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ వేదికపై చివరిసారిగా ఆసీస్‌ 1988లో వెస్టిండీస్‌ చేతిలో ఓడింది. 32 ఏండ్ల తర్వాత తొలిసారిగా టీమ్‌ఇండియా గబ్బాలో ఆసీస్‌కు ఓటమి రుచి చూపించింది.

- Advertisement -

Latest news

Related news