ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ దీటుగా బదులిస్తోంది. 166/2 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ఆరంభించిన కంగారూలు 338 పరుగులకు ఆలౌటయ్యారు. శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ 45 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. పుజారా (9), తాత్కాలిక కెప్టెన్ రహానె (5) క్రీజులో ఉన్నారు.
ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ మార్నస్ లబుషేన్ (91) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా.. స్టీవ్ స్మిత్ (131) సెంచరీతో ఆదుకున్నాడు. ఈ క్రమంలోనే జట్టు స్కోర్ 206 పరుగుల వద్ద జడ్డూ లబుషేన్‌ను ఔట్ చేశాడు. ఆపై బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.
అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన టీమ్ఇండియా ఓపెనర్లు శుభారంభం చేశారు. గాయం నుంచి కోలుకొని నేరుగా ఈ మ్యాచ్‌లో ఆడుతున్న రోహిత్ శర్మ (26), యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (50)తో కలిసి తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో హేజిల్‌వుడ్ వేసిన 27వ ఓవర్ చివరి బంతికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి రోహిత్ ఔటయ్యాడు. ఆపై గిల్ కమిన్స్ బౌలింగ్‌లో గ్రీన్ చేతికి చిక్కాడు.