29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

తండ్రి కలను నిజం చేశాడు.. కానీ

పరిస్థితులన్నీ సక్రమంగా ఉన్నప్పుడు.. దృష్టంతా లక్ష్యం పైనే పెట్టి అనుకున్నది సాధించొచ్చు. కాకపోతే అది అన్నిసార్లు సాధ్యం కాదు.. అందరికీ సాధ్యం కాదు. ఎంత కష్టం వచ్చినా.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అడుగు ముందుకే వేయడం కార్యసాధకుల లక్షణం. మహ్మద్ సిరాజ్.. అదే పని చేశాడు. అంతర్జాతీయ స్థాయి క్రికెట్ లో ఇండియా తరపున టీమిండియాలో ఆడాలనేది తన కల. తండ్రి కోరిక. అలాంటిది.. ఆ కల తీరే సమయంలో కష్టాలు పలకరించి.. పక్కనే తిష్ట వేసుకోని కూర్చున్నాయి. కష్టం వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఉండటం గొప్ప విషయం. మహ్మద్ సిరాజ్ అదే పని చేశాడు.  తట్టుకోలేనంత కష్టమొచ్చినా.. తడబడకుండా నిలబడ్డాడు.

ఆస్ట్రేలియా టూర్ కోసం టీమిండియాలో ఎంపికైన సిరాజ్.. ఇలా ఆస్ట్రేలియాలో అడుగు పెట్టాడో లేదో.. తండ్రి మరణ వార్త అందింది. తనను ఇంటర్నేషనల్ క్రికెటర్ గా చూడాలన్న తండ్రి కోరిక తీరకుండానే.. సిరాజ్ ను అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ గా చూడకుండానే ఆయన కన్ను మూశాడు. ఇప్పుడు ఏం చేయాలి? తండ్రిని చివరి చూపు చూడాలా.. మ్యాచ్ ఆడి ఆయన కన్న కలను నిజం చేయాలా? ఏం  చేసినా ఆయన కోసమే. అందుకే.. కన్నతండ్రి అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా ఆస్ట్రేలియా టూర్ లోనే ఉండిపోయాడు…వెళ్లలేకపోయాడు. గుండె నిండా తండ్రిని చివరి చూపు కూడా చూసుకోడానికి నోచుకోలేదు సిరాజ్. కానీ.. దేశం కోసం ఆడే అవకాశం అందరికీ.. అన్నిసార్లు రాదు. ‘నాన్న లేకపోయినా.. ఆయన కల నెరవేర్చురా’ అని కర్తవ్య భోద చేసింది. ఆ మాటలు సిరాజ్ మనసులో నాటుకుపోయాయి. అందుకు తగ్గట్టుగానే ఆస్టేలియాలో వాళ్ళ సొంత పిచ్ లపై ఒక మ్యాచ్ లో5 వికెట్లు, సిరీస్ మొత్తంలో 13 వికెట్లు సాధించి అందరి ప్రశంసలు పొందాడు. కానీ.. ఆ విషయం వాళ్ల నాన్నకు తెలియదు. తన కోసం.. తనను క్రికెటర్ ని చేయడం కోసం తండ్రి పడ్డ కష్టమంతా గుర్తొచ్చి కన్నీటి పర్యంతం అయ్యాడు. కష్టాలొచ్చినప్పుడు మనిషి ఎంత ధైర్యంగా ఉంటే అంత ఫలితం ఉంటుందని సిరాజ్ నిరూపించాడు.

మ్యాచ్‌ నాలుగో రోజు… పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఒక్కడే ఎదురు చూస్తూ నిలబడ్డాడు. ఐదు వికెట్ల ప్రదర్శన అనంతరం సహచరుల అభినందనల మధ్య ముందుగా నడుస్తూ వచ్చిన సిరాజ్‌ను ఎంతో ఆప్యాయంగా హత్తుకొని తన ఆనందాన్ని ప్రదర్శించాడు. ఈ దృశ్యం మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. తాను గాయంతో దూరం కావడంతో బౌలింగ్‌ భారం మోసిన ఆటగాడు అంచనాలకు మించి రాణించడం, ఐదు వికెట్లతో తిరిగి రావడం బుమ్రాలో సంతోషం నింపిందనడంలో సందేహం లేదు. క్యాచ్‌ పట్టి సిరాజ్‌ ఐదో వికెట్‌ ప్రదర్శనకు కారణమైన శార్దుల్‌ ఠాకూర్‌ చప్పట్లతో నవ్వుతూ అతడి వెంట నడవటం… ఐదో వికెట్‌ తీశాక ఆకాశం వైపు చూస్తూ సిరాజ్‌ తన తండ్రిని గుర్తు చేసుకున్న క్షణాన స్టేడియమంతా సిరాజ్ కు తమ మద్ధతు ప్రకటించగా.. సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి.

సిరాజ్‌కు కష్టకాలంలో జట్టు మొత్తం అండగా నిలబడింది. తండ్రి అంత్యక్రియలకు వెళ్లొద్దని తీసుకున్న నిర్ణయం నిజంగానే సిరాజ్ కెరీర్‌ను మార్చేసింది. మెల్‌బోర్న్‌ నుంచి బ్రిస్బేన్‌ చేరే క్రమంలో సిరాజ్ ఆట మరింత మెరుగైంది. తన మూడో టెస్టులోనే సహచర పేసర్లకు సూచనలిస్తూ కనిపించిన సిరాజ్‌ స్వయంగా ఐదు వికెట్లతో మార్గనిర్దేశనం చేశాడు. సిరాజ్‌ తండ్రి మరణ వార్త తెలిసిన రోజున ‘మీ నాన్న ఆశీస్సులు నీ వెంట ఉంటాయి. ఈ టూర్‌లో ఏదో ఒక దశలో మ్యాచ్‌ ఆడతావు. ఐదు వికెట్లు కూడా తీస్తావు’ అని హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి చెప్పిన మాట అక్షర సత్యమైంది. ఇప్పుడు సచిన్‌ మొదలు క్రికెట్‌ దిగ్గజాలంతా అతని అంకితభావంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ అభినందనలకు సిరాజ్‌ అర్హుడనడంలో ఎలాంటి సందేహం లేదు!

- Advertisement -

Latest news

Related news