పేదలకు ఉచితంగా నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా ఆరోగ్యశ్రీ పనిచేస్తోందని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళే అవసరం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నామన్నారు. నిబంధనలకు అనుగుణంగా కొత్త ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ ఎంపానల్ మెంట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఆయుష్మాన్ భారత్..కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పథకం. దీని కంటే ముందునుంచే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీని అమలుచేస్తున్నది. పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ, వారి పాలిట సంజీవనిలా మారింది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఈ పథకం.. ఆయుష్మాన్ భారత్ కంటే ఎంతో మెరుగైనదని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఆయుష్మాన్ భారత్‌లో లేని చికిత్సలు కూడా ఆరోగ్యశ్రీలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆరోగ్యశ్రీ, ఉద్యోగ, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌పై అధికారులతో ఈటల సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు, పథకంలో లీకేజీలను అరికట్టేందుకు ప్రత్యేకకమిటీ వేసి సమగ్ర నివేదిక అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మోసాలకు పాల్పడే దవాఖానలపై ఉక్కుపాదం మోపాలన్నరు.
ఆరోగ్య శ్రీ జాబితాలో ఉన్న దవాఖానలు చికిత్స అందించడానికి నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఈటల ఆదేశించారు. ఆ హాస్పిటళ్లపై 104కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. దవాఖానల్లో ఆరోగ్యశ్రీ ప్రత్యేక వార్డు అంటూ విభజన చేయకుండా, సాధారణ పేషెంట్లతో పాటే చికిత్స అందేలా చూడాలని అధికారులకు సూచించారు. పడక గదులు, ఖరీదైన పరికరాల పేరిట అధికంగా డబ్బలు వసూలుచేస్తే దవాఖానలపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వాటిని అరికట్టేందుకు విజిలెన్స్ బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. చికిత్స పొందిన వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని, అవసరం అనుకుంటే దవాఖానలను ఆరోగ్యశ్రీ జాబితా నుంచి తొలగించాలని సూచించారు. ఇక, జాబితాలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న దవాఖానల నాణ్యతను పరిశీలించి అనుమతులు ఇవ్వాలన్నారు. ఉద్యోగులు, జర్నలిస్టుల హెల్త్‌కార్డులు ఉన్నవారికి అన్ని దవాఖానల్లో అన్ని వైద్యసేవలు అందించేలా చూస్తామన్నారు.
ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న సిబ్బంది, చికిత్సకు అనుమతి ఇచ్చే ప్యానల్ డాక్టర్ల సంఖ్య పెంచడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఈటెల తెలిపారు. ప్రైవేటు దవాఖానల్లో రోగులకు సహకరించే ఆరోగ్యమిత్రల పనిభారానికి అనుగుణంగా క్రమబద్ధీకరణ జరగాలన్నారు. ఒక మిత్ర ఒక దవాఖానలో ఒక ఏడాది పాటు పనిచేసేలా చూడాలన్నారు. గతంలో ఆరోగ్యశ్రీ బకాయిలు వేల కోట్లలో ఉండేవని, ఇప్పుడు 199 కోట్లే ఉన్నాయని చెప్పారు. త్వరలోనే వాటిని కూడా చెల్లిస్తామన్నారు. సర్కారు దవాఖానలను కార్పొరేట్ హాస్పిటళ్లకు దీటుగా మార్చుతున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించేందుకు అనుమతి పొందిన ప్రైవేటు దవాఖానలు ఇక నుంచి రోగులకు అన్ని రకాల వైద్యసేవలు అందించాల్సిందేనని వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ఎంపిక చేసిన వైద్యసేవలను మాత్రమే ఆరోగ్యశ్రీ కింద ఆయా దవాఖానలు అందిస్తున్నాయి. దీనివల్ల పేషెంట్లకు ఇబ్బందులు తలెత్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. త్వరలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు వైద్యారోగ్యశాఖ చర్యలు తీసుకోనుంది. కొత్తగా ఆరోగ్యశ్రీ జాబితాలో చేరబోయే ప్రైవేటు దవాఖానలు కూడా ఈ నిబంధనకు అనుగుణంగా అన్ని వైద్య సేవలను అందించేందుకు అంగీకరించాల్సి ఉంటుంది.