గ్రేటర్ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రచార గడువు ముగిసి.. కేవలం.. పోలింగ్ మాత్రమే మిగిలింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అధికారులు పోలింగ్ నిర్వహిస్తారు. ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. 150 డివిజన్లకు రేపు పోలింగ్ జరుగనుంది. కరోనా దృష్ట్యా ఈ ఎన్నికలు బ్యాలెట్ పత్రాల ద్వారా నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. గ్రేటర్లో మొత్తం ఓటర్ల సంఖ్య 74 లక్షల 67వేల 256 మంది. కాగా వారిలో పురుషులు 38 లక్షల 89 వేల637 మంది, స్త్రీలు 35 లక్షల 76వేల941 మంది, ఇతరులు 678 మంది ఉన్నారు. మొత్తం 150 డివిజన్లలో 1122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీల్లో టీఆర్ఎస్ 150 స్థానాలకు పోటీ చేస్తుండగా.. బీజేపీ 149, కాంగ్రెస్ 146, ఎంఐఎం 51 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. జంగంమెట్ డివిజన్లో అత్యధికంగా 20 మంది బరిలో ఉండగా.. ఐదు డివిజన్లలో మాత్రం కేవలం ముగ్గురు అభ్యర్థులే పోటీ చేస్తున్నారు.