గ్రేటర్ పరిధిలో ఉచిత నీటి సరఫరాపై జలమండలి కసరత్తు చేస్తున్నది. పేద, మధ్య తరగతి ప్రజలే కాకుండా అన్ని వర్గాలకు మేలు జరిగేలా 20వేల లీటర్ల ఉచిత తాగునీటిని అపార్ట్మెంట్ వాసులకూ వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ గ్రేటర్ ప్రచారంలో నగర ప్రజలకు వాగ్ధానం చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మహానగరంలో 10 లక్షల కుటుంబాలు ఉచిత నీటి సరఫరా పథకంలోకి వస్తాయని జలమండలి అంచనా వేసింది.

97 శాతం మేర నగర ప్రజలకు లబ్ధి జరిగే ఈ ప్రక్రియలో విధి విధానాల రూపకల్పనపై ఎండీ దానకిశోర్ బుధవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సంస్థ పరిధిలో అపార్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి? 50 ఫ్లాట్స్, 100 ఫ్లాట్స్ దాటిన అపార్ట్‌మెంట్స్‌కు ఏ విధంగా విధానాలు ఉండాలి? ప్రతి నల్లాకు మీటర్ బిగింపు? ఉచిత నీటి సరఫరాతో ప్రభుత్వంపై పడే భారం ఎంత? తదితర అంశాలపై సమగ్ర నివేదికను రూపొందిస్తున్నారు. రానున్న రెండు రోజుల్లో సమగ్ర నివేదికను పురపాలక శాఖా మంత్రి కేటీఆర్‌కు అందజేయనున్నారు.