18.3 C
Hyderabad
Wednesday, October 28, 2020

కరోనాతో గాంధీ వైద్యుల రాజీలేని పోరాటం

కరోనాకు భయపడి ప్రజలంతా ఇంట్లో ఉంటుంటే, వైద్యులు, వైద్య సిబ్బంది మాత్రం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కుటుంబాలకు దూరంగా, రోగులకు దగ్గరగా ఉంటూ మానవత్వానికి పర్యాయపదంగా నిలుస్తున్నారు. కష్టకాలంలో కలిసికట్టుగా కరోనాతో కొట్లాడుతున్నారు. ముఖ్యంగా పూర్తిస్థాయి కొవిడ్‌ హాస్పిటల్‌ గా మారిన గాంధీ దవాఖానలో వైద్యులు కష్టాలు పడుతున్నా, ఎందరి నుంచో నీలాపనిందలు ఎదురవుతున్నా వాటన్నింటినీ దిగమింగుకొని అంకితభావంతో సేవలు అందిస్తున్నారు. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా ప్రతి క్షణం రోగులకు సపర్యలు చేస్తున్నారు. ఊపిరి పోతున్న వారికి ఊపిరి పోస్తూ, మానసిక ధైర్యం నూరిపోస్తూ.. ప్రాణాలను కాపాడుతున్నారు. చెరువులో ఉండి నీళ్లకు దూరంగా ఉన్నట్టు ఇంట్లోనే ఉంటూ కుటుంబసభ్యులతో భౌతిక దూరం పాటిస్తున్నారు.

గాంధీ ఆసుపత్రి పూర్తి స్థాయి కోవిడ్ దవాఖానగా మారింది. రెండు వేల పడకల సామర్థ్యం ఉన్న గాంధీ దవాఖానలో సుమారు 3 వేల మంది వైద్యులు, నర్సింగ్‌, ల్యాబ్‌, పారా మెడికల్‌, పారిశుధ్య సిబ్బంది కొవిడ్‌ రోగులకు సేవలు అందిస్తున్నారు. సాధారణంగా రెండు, మూడు గంటలు విరామం లేకుండా పనిచేస్తే అలసిపోయి కాసేపు విరామం తీసుకుంటాం. కాని ప్రస్తుతం గాంధీలో వైద్య సిబ్బంది 6 నుంచి 12 గంటల పాటు నిర్విరామంగా రోగులకు సేవలందిస్తున్నారు. సరిగ్గా ఊపిరి ఆడకున్నా 6 నుంచి 8 గంటలపాటు పీపీఈ కిట్లు, మాస్కులతోనే గడుపుతున్నారు. వెయ్యి మంది వైద్యులు, 530 మంది నర్సింగ్‌ సిబ్బంది, 320మంది వార్డు బాయ్‌లు, 200 మంది పేషెంట్‌ కేర్‌ సిబ్బంది, 60 మంది సెక్యూరిటీ సిబ్బంది, 100 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు విడతలవారీగా సేవలు అందిస్తున్నారు. వారం పాటు విధులు నిర్వహించి మరో వారం హోమ్‌ క్వారంటైన్‌లో గడిపి తిరిగి విధుల్లో చేరుతున్నారు. ఇండ్లలో చిన్నపిల్లలు, వృద్ధులు ఉండటం, అపార్ట్‌ మెంట్లు, అద్దె ఇండ్లలో స్థానికుల నుంచి అభ్యంతరాల వల్ల కొందరు వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, ఇతర సిబ్బంది దవాఖాన పరిసరాల్లోని హోటళ్లు, దవాఖానలోని వసతి గృహాలలోనే బసచేస్తూ విధులకు హాజరవుతున్నారు. కంటినిండా నిద్ర, కడుపు నిండా తిండి లేకున్నా రోగుల బాగోగుల్లోనే సంతృప్తిని వెతుక్కుంటున్నారు.

నిరుపేద, మధ్యతరగతి ప్రజలు కార్పొరేటు దవాఖానలకు వెళ్లే పరిస్థితి ఉండదు. అలాంటివారికి గాంధీ దవాఖాననే పెద్ద దిక్కు. ఇక్కడ ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పించింది. 200 మంది పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేస్తున్న వైద్యులు రోజుకు 6 నుంచి 12 గంటల వరకు రోగుల వద్దే ఉండి సేవలు అందిస్తున్నారు. ఐదు రోజుల పాటు విధులు నిర్వర్తించి, మరో ఐదు రోజులు క్వారంటైన్‌లో ఉంటున్నారు. మీడియాలో వచ్చే కథనాలను వైద్యులు, వైద్యసిబ్బంది పట్టించుకోవడం లేదు. నెలలుగా సెలవు తీసుకోకుండా కుటుంబాలకు దూరంగా ఉంటూ ఒత్తిడిలోనూ రోగులకు సేవలందిస్తున్నారు. దీంతో 90 నుంచి 95శాతం మంది పూర్తిగా కోలుకుని ఇండ్లకు వెళ్తున్నారు. రోగులు పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జి అయినప్పుడు చూసి.. డాక్టర్లు తమ ఒత్తిడిని మర్చిపోతూ ఆనందపడుతున్నారు. అలాంటి వైద్యులపై అపనిందలు మోపడం సరికాదు. వారి సేవలకు సెల్యూట్ చేయాల్సిందే. ఐనవాళ్లను వదులుకుని రోగులకు వైద్యం అందిస్తున్న ఈ త్యాగమూర్తులను కాపాడుకోవడం, తగిన గౌరవం ఇవ్వడం అందరి బాధ్యత.

- Advertisement -

Latest news

Related news

ప్రారంభమైన బీహర్ తొలి విడత పోలింగ్

బీహార్‌లో  తొలిదశ ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు జిల్లాల్లోని 71  శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది.  తొలివిడుత...

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...

నాయిని సతీమణి మృతిప‌ట్ల మంత్రుల సంతాపం

మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిప‌ట్ల తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. అహ‌ల్య భౌతిక‌కాయానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.   నాయిని సతీమణి...