27 C
Hyderabad
Friday, December 4, 2020

కరోనా వ్యాక్సిన్‌ తొలిదశలో ఎవరికి వేయాలి?

కరోనాకు మరికొన్ని నెలల్లో విరుగుడు రావడం ఖాయమైంది. ప్రపంచవ్యాప్తంగా వందకుపైగా బృందాలు కొవిడ్‌-19కు టీకా తయారుచేయడంలో నిమగ్నమయ్యాయి. దాదాపు 30 రకాల వ్యాక్సిన్లు క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు చేరుకున్నాయి. మన దేశంలోనూ భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కోవాగ్జిన్‌, జైడస్‌ కాడిలా సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు మానవులపై ప్రయోగాల దశలో ఉన్నాయి. ఆగస్టు రెండో వారంలో టీకా విడుదల చేస్తామని రష్యా ప్రకటించగా, ఈ ఏడాది చివరినాటికి లేదా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో టీకా వస్తుందని నిపుణులు చెప్తున్నారు.

ప్రస్తుతం ప్రపంచ జనాభా 780 కోట్లు.. టీకా అందుబాటులోకి వచ్చే నాటికి వైరస్‌ బారినపడి కోలుకున్నవారు.. తెలియకుండానే ఇమ్యూనిటీ సాధించినవారు.. సుమారు 150-180 కోట్ల మంది ఉంటారని అంచనా. అయితే మిగతా 600 కోట్ల మందిలో ఎంతమందికి టీకా వేయాల్సి ఉంటుందన్నది ప్రశ్నగా మారింది. కనీసం సగం జనాభాలో ప్రతిరక్షకాలు ఉత్పత్తి అయితే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యమని నిపుణులు చెప్తున్నారు. ఈ లెక్కన 250 కోట్ల మందికి టీకా వేయాల్సి రావొచ్చు. మరోవైపు ఒక్కో వ్యక్తికి కనీసం రెండుసార్లు.. రెండు డోసులు టీకా వేస్తేనే కొవిడ్‌-19ను ఎదుర్కొనే సామర్థ్యం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే 500 కోట్ల డోసులు ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది.

కరోనా అన్ని వయస్సుల వారిపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో టీకాను ముందుగా ఎవరికి వేయాలనేది పెద్ద చిక్కుప్రశ్నగా మారింది. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారిని ‘వల్నరల్‌ గ్రూప్‌’గా పేర్కొంటారు. ముందుగా వీరికే ఇవ్వాలనే డిమాండ్‌ మొదలవుతున్నది. అయితే వల్నరల్‌ గ్రూప్‌ను కొన్ని నెలలు ఇంటికే పరిమితం చేసి.. ముందుగా యువత, మధ్యవయస్కులకు వేస్తే ఆర్థిక వ్యవస్థ చక్కబడుతుందని మరికొందరు వాదిస్తున్నారు. 

వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడానికి పెద్దగా సమయం లేదని.. వాటిని ఎలా వినియోగించాలో ప్రభుత్వాలు వెంటనే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ దిశగా అమెరికా ఇప్పటికే ఒక కమిటీని నియమించింది. ప్రస్తుతం వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యం కొన్ని దేశాలకే ఉన్నది. ఉత్పత్తయిన డోసుల్లో ప్రధాన వాటా దానిని అభివృద్ధి చేసిన సంస్థ ఉన్న దేశానికి, ఉత్పత్తి చేస్తున్న దేశానికి వెళ్తాయి. కాబట్టి వ్యాక్సిన్‌ టెక్నాలజీని కొనుగోలు చేయడం, ముందస్తుగా ఆర్డర్లు ఇవ్వడం, వచ్చే డోస్‌లను ప్రణాళికాబద్ధంగా వినియోగించడం, వివిధ దశల్లో అవసరమైనవారికి వ్యాక్సిన్‌ అందేలా చర్యలకు ప్లాన్‌ రూపొందించాలని స్పష్టం చేస్తున్నారు. 

 భారత్‌ బయోటెక్‌ ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ క్లినికల్‌ ట్రయల్స్‌ తమిళనాడులోనూ ప్రారంభం అయ్యాయి. చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం మెడికల్‌ హాస్పిటల్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌లో వలంటీర్లపై వ్యాక్సిన్‌ ప్రయోగించారు. మరోవైపు ఢిల్లీకి చెందిన ప్రముఖ ‘డాక్టర్‌ డాంగ్స్‌ ల్యాబ్‌’ కొవాగ్జిన్‌ ప్రయోగాల్లో భాగస్వామి అవుతున్నట్టు ప్రకటించింది. క్లినికల్‌ ట్రయల్స్‌ కు సంబంధించి ఇది సెంట్రల్‌ ల్యాబ్‌గా పనిచేయనుంది. కొవాగ్జిన్‌ ట్రయల్స్‌ ను దేశవ్యాప్తంగా ఎంపికచేసిన 12 దవాఖానల్లో నిర్వహించనున్నారు.

పేద దేశాలతోపాటు యుద్ధాలతో ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిన సిరియా, ఇరాక్‌వంటి దేశాలకు టీకా కొని, ప్రజలకు అందించడం ఆర్థికంగా పెనుభారంగా మారుతోంది. ఆఫ్రికా దేశాలకు టీకా అందజేస్తామని కంపెనీలు చెప్తున్నా.. ఆర్థికంగా భారం పడకుండా ఎలా చూస్తారనే ప్రణాళిక వెల్లడించడం లేదు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి, జీ7, జీ 20, ఒపెక్‌ వంటి గ్రూప్‌లు, మిగతా ప్రపంచ దేశాలు ముందుకురావాలని అంతర్జాతీయంగా డిమాండ్లు వస్తున్నాయి.

అటు టీకా ధర రూ.1500-2000 వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక్కో కుటుంబంలో సగటున ఐదుగురిని లెక్కవేసుకున్నా.. రూ.7,500-10 వేల వరకు ఖర్చవుతుంది. ఇది నిరుపేదలకు మోయలేని భారమే. ప్రపంచబ్యాంకు లెక్కల ప్రకారం 2019 చివరినాటికి సుమారు 64 కోట్ల మంది నిరుపేదలు ఉన్నారు. వీరంతా వ్యాక్సిన్‌ ఖర్చులు భరించలేరు. అమెరికన్లందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇస్తామని ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించారు. ఇదే తరహాలో మిగతా దేశాలూ పేదలు, మధ్యతరగతి వారికి ఉచితంగా లేదా సబ్సిడీపై వ్యాక్సిన్‌ ఇచ్చే అవకాశాలు పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.

కారుకు తొలివిజయం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు....