గతంలో కాంగ్రెస్సోడు కరెంటు ఇయ్యక సంపితే.. ఇప్పుడు బీజేపోడు మీటర్లు పెట్టి సంపుతనంటుండని మంత్రి హరీశ్ రావు ఆ రెండు పార్టీలపై మండిపడ్డారు. ఇన్నాళ్లు కనిపించని ఈ జాతీయ పార్టీలు.. రామలింగారెడ్డి అకాలమరణం చెందితే ఓట్ల కోసం మళ్లీ వచ్చారని విమర్శించారు. టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని.. సీఎం కేసీఆర్ ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకుంటున్నాడని స్పష్టం చేశారాయన. సుజాతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎళ్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ రామలింగారెడ్డిలా సేవ చేస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత చెప్పారు. దుబ్బాక ఉప-ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది. భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఊరూరూ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. దుబ్బాక అభివృద్ధికి సీఎం కేసీఆర్, దివంగత రామలింగారెడ్డి చేసిన కృషిని వివరిస్తున్నారు. ఇందులో భాగంగా దుబ్బాక మండలం రామక్కపేటలో అభ్యర్థి సోలిపేట సుజాతతో కలిసి మంత్రి హరీష్ రావు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, MLA పద్మా దేవేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. వారికి గ్రామస్థులు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు.