త్వరలో పాఠశాలలు తెరిచేందుకు విద్యాశాఖ కసరత్తులుచేస్తున్నది. వార్షిక పరీక్షలు నిర్వహించే ముందు పాఠశాలలను కనీసం మూడునెలలపాటు తెరువాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నది. ప్రభుత్వం అనుమతిస్తే జనవరి నాలుగో తేదీ నుంచే స్కూళ్లు, జూనియర్ కాలేజీలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నది. ముందు 9, 10 తరగతులు, జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ క్లాసులు నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపించింది. ఆ తర్వాత దశల వారిగా 6 నుంచి 8 తరగతులు, క్రమంగా ప్రాథమిక పాఠశాలలను రెగ్యులర్‌గా నిర్వహించాలని భావిస్తున్నది. ఈ మేరకు ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌కు పంపించామని విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆన్లైన్ క్లాసుల పట్ల విద్యార్థులు ఆసక్తి చూపడం లేదని ప్రభుత్వ స్కూల్ టీచర్ల సంఘాల నాయకులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు బడులు తెరవాలని కోరుతూ వినతిపత్రాలు ఇచ్చారని మంత్రి అన్నారు.
కొవిడ్-19 నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష పేపర్లను తగ్గించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లతోనే వార్షిక పరీక్షలు ముగించాలని భావిస్తున్నట్టు అధికారులు తెలిపారు. పదో తరగతి పరీక్షలను ఈ సారి మార్చికి బదులుగా మే నెలలో, ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ రెండో వారంలో నిర్వహించనున్నారు. అంతకుముందుగానే ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తారు. జనవరి మొదటివారం నుంచి జూనియర్ కాలేజీలు ప్రారంభమైతే.. రెగ్యులర్ పాఠాలతో పాటు ప్రాక్టికల్స్‌ను కూడా బోధిస్తారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సైతం సీఎం కార్యాలయానికి పంపారు.