21.4 C
Hyderabad
Friday, December 4, 2020

జీఎస్టీ హామీల అమలు బాధ్యత కేంద్రానిదే

రాష్ర్టాలకు చెల్లించాల్సిన పరిహారాన్ని తగ్గించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం అసంతృప్తి కలిగించిందన్నారు సీఎం కేసీఆర్‌. జీఎస్టీ వల్ల రాష్ర్టానికి ఆదాయం తగ్గుతుందని తెలిసినా.. దేశ ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ పూర్తి మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. జీఎస్టీ వల్ల స్వల్పకాలికంగా నష్టం కలిగినా, దీర్ఘకాలికంగా పెట్టుబడులను ఆకర్షించడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని

భావించామన్నారు. యూపీఏ ప్రభుత్వం సెంట్రల్‌ సేల్స్‌ ట్యాక్స్‌ ప్రవేశపెట్టే సమయంలో రాష్ర్టాలు నష్టపోయే ప్రతి రూపాయిని చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత మొండిచేయి చూపిందన్నారు. జీఎస్టీ అమలుతో రాష్ర్టాలు కోల్పోయే ఆదాయాన్ని ప్రతి రెండు నెలలకు ఒకసారి చెల్లించాలని అందులో స్పష్టంగా ఉందని.. అయినా కేంద్రం సమయానికి చెల్లించకుండా తాత్సారం చేస్తున్నదని మండిపడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్‌ నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు.  

లాక్‌డౌన్‌తో ఓవైపు రాష్ర్టాల ఆదాయం పడిపోగా, మరోవైపు ఖర్చులు, చెల్లింపులు పెరిగిపోయాయన్నారు సీఎం కేసీఆర్‌. ఈ ఏడాది ఏప్రిల్‌లో తెలంగాణ రెవెన్యూ ఆదాయం 83 శాతం పడిపోయిందన్నారు. అదేసమయంలో కరోనా నియంత్రణ చర్యలకు భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. అతికష్టం మీద మార్కెట్‌ నుంచి అప్పులు, అడ్వాన్సులు, ఓడీఎఫ్‌లు తదితర మార్గాల్లో నిధులు తెచ్చి సర్దుబాటు చేసుకున్నామని లేఖలో వివరించారు. విత్త విధానం కేంద్రం చేతుల్లో ఉండటం వల్ల రాష్ర్టాలు మార్కెట్‌ నుంచి అప్పులు తీసుకోవాలన్నా కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌డీ కేంద్రానికి 3.5 శాతం ఉంటే రాష్ర్టాలకు 3శా తం మాత్రమే ఉన్నదని.. ఇది సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధమని సీఎం కేసీఆర్‌ తేల్చిచెప్పారు. 

కేంద్రం అప్పు తీసుకోవడం వల్ల ప్రభుత్వ బాండ్లు, మార్కెట్‌లో ఇతర రుణాలపై వడ్డీ భారం పెరుగుతుందని, కాబట్టి రాష్ర్టాలే అప్పులు తీసుకోవాలని చెప్పడం సమంజసంగా లేదన్నారు సీఎం కేసీఆర్‌. ఒకే ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడిదారుల సమూహం నుంచి కేంద్రం లేదా రాష్ట్రంలో ఎవరు అప్పు తీసుకున్నా పెద్దగా తేడా ఏమీ ఉండదన్నారు. పైగా కేంద్ర ప్రభుత్వానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.. కాబట్టి రుణాలు తీసుకొని, రాష్ర్టాలకు పూర్తి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జీఎస్టీ వల్ల రాష్ర్టాలు సగటున 47శాతం రెవెన్యూ ఆదాయం కోల్పోతే కేంద్రం కేవలం 31 శాతం నష్టపోయిందని లేఖలో పేర్కొన్నారు. జీఎస్టీతో రాష్ర్టాలకు సొంతగా నిధులు సమకూర్చుకునే ప్రధాన ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోయాయని చెప్పారు. కానీ కేంద్రానికి ఆదాయం పన్ను, కార్పొరేషన్‌ ట్యాక్స్‌, కస్టమ్స్‌ డ్యూటీ, ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నుంచి డివిడెండ్లు తదితర రూపాల్లో అదనపు ఆదాయం వస్తున్నదని గుర్తుచేశారు. కరోనా వంటి విపత్కర సమయంలో కేంద్రం రాష్ర్టాలకు ఉదారంగా నిధులు ఇచ్చి ఆదుకోవాల్సింది పోయి.. హక్కులను కూడా హరిస్తున్నదని మండిపడ్డారు. పైగా రాష్ర్టాల రుణాలను ఆత్మనిర్భర్‌ అభియాన్‌ ప్యాకేజీ కిందికి చేర్చడం మరింత నష్టం కలిగిస్తుందని చెప్పారు.

జీఎస్టీ అమలు చేస్తే కేంద్రం విధించే సర్‌చార్జీలు, ఇతర పన్నుల్లో తమకు కూడా వాటా వస్తుందని రాష్ర్టాలు భావించాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. అయితే అవన్నీ భ్రమలని తేలిపోయిందన్నారు. కేంద్రం ఇటీవలే దిగుమతి వస్తువులపై సుంకాలు పెంచిందని.. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూ.13 అదనపు పన్ను విధించిందని గుర్తుచేశారు. చమురు ద్వారానే కేంద్రానికి ఏటా రూ.2 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందని.. రాష్ర్టాలకు పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్‌ విధించే అవకాశం లేకుండా చేసిందన్నారు.

14 శాతం వృద్ధి రేటు ప్రకారం పరిహారం చెల్లించాలని జీఎస్టీ చట్టంలో ఉన్నదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. కానీ కేంద్రం 2020-21 సంవత్సరానికి సంబంధించి 10 శాతానికే లెక్కించాలని నిర్ణయించడం దారుణమన్నారు. దీంతో కరోనా వల్ల రాష్ర్టాలు కోల్పోయే ఆదాయానికి.. జీఎస్టీ పరిహారానికి మధ్య అగాథం ఏర్పడిందన్నారు. కేంద్రం ఏకపక్షంగా ఇలాంటి నిర్ణయాలను తీసుకోవడాన్ని చట్టం అంగీకరించదని.. కాబట్టి ఈ విషయంలో పునరాలోచించుకోవాలన్నారు. కేంద్రమే అప్పులు తీసుకొని రాష్ర్టాలకు పూర్తి పరిహారాన్ని అందించాలని డిమాండ్‌ చేశారు. గతంలోనూ జీఎస్టీ పరిహార నిధి నుంచి రాష్ర్టాలకు పంచగా మిగిలిన సొమ్మును కేంద్రం కన్సాలిడేటెడ్‌ ఫండ్‌లో జమ చేసుకొన్నదని.. ఇది చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు సీఎం కేసీఆర్.

రాష్ర్టాలే అప్పు తీసుకోవాలన్న సూచనను కేంద్రం కచ్చితంగా వెనక్కి తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. దీనికి బదులు కేంద్రమే మొత్తం సొమ్మును అప్పుగా తీసుకొని, రాష్ర్టాలకు పంచాలన్నారు. తిరిగి చెల్లించే గడువును 2022గానే ఉంచాలా? పొడిగించాలా? అన్నది జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయించాలన్నారు సీఎం కేసీఆర్

- Advertisement -

Latest news

Related news

ఫ్రంట్ లైన్ సిబ్బంది.. డేటాబేస్ రెడీ చేయండి : సీఎస్ సోమేష్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు , పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది వివరాలతో కూడిన డేటా బేస్...

కేంద్ర ప్రభుత్వం భోజనాన్ని తిరస్కరించిన రైతులు

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులను గురువారం కేంద్ర ప్రభుత్వం రెండో విడత చర్చలకు పిలిచింది. ఢిల్లీ విజ్ఞాన కేంద్రంలో కేంద్రమంత్రులు పీయూష్‌...

త్వరలో వరంగల్లో ఎలక్ట్రిక్ బస్సులు

ప్రస్తుతం హైదరాబాద్‌లో 40 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వరంగల్‌ లో కూడా బ్యాటరీ బస్సులు నడిపించాలనుకున్నా సమ్మె, కరోనా కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా కేంద్రప్రభుత్వ గైడ్‌లైన్స్‌ మేరకు...

ఆ అబ్బాయి ఎన్నికల విధులకు రాలేదు : ఈసీ

17 సంవత్సరాల బాలుడిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇప్పారు. ఆ వార్తల్లో నిజం లేదని సదరు...