తెలంగాణపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతున్నది. దీంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వాన పడింది. దిల్సుఖ్నగర్, కొత్తపేట, సరూర్నగర్, బోయిన్పల్లి, తిరుమలగిరితోపాటు.. అల్వాల్, మారేడుపల్లి, ప్యాట్నీ, ప్యారడైజ్, బోరబండ, అల్లాపూర్, మోతీనగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, ఫిలింనగర్లో మామూలు వర్షం కురిసింది. అటు సనత్నగర్, వెంగళ్ రావు నగర్, ఎర్రగడ్డ, ఈఎస్ఐ, మైత్రీవనంలో మోస్తరు వాన పడింది.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో భారీ వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా కొడంగల్, సంగారెడ్డి జిల్లా కేంద్రం, పఠాన్ చెరువు నియోజకవర్గం, నల్లగొండ జిల్లాలోని కనగల్, తిప్పర్తి మండలాలు, దేవరకొండలో సాధారణ వాన పడింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో చిరుజల్లులు కురిశాయి.
మరోవైపు రాష్ట్రంపై కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో.. 6వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు గ్రేటర్ హైదరాబాద్ లోనూ నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఉపరితల ద్రోణి, క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వాతావరణంలో మార్పులు, ఉష్ణోగ్రతలు తగ్గడంతోపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. సోమవారం కేరళను తాకిన రుతుపవనాలు.. క్రమంగా ఆ రాష్ట్రమంతటా విస్తరిస్తున్నాయి. అటు రాత్రి తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాలతోపాటు, దక్షిణ అరేబియా సముద్రం, లక్షద్వీప్, మాల్దీవుల వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఈరోజు కర్ణాటక, దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నది…