21.7 C
Hyderabad
Friday, January 22, 2021

తెలంగాణ ఆత్మగౌరవానికి ఢిల్లీ అమర్యాద

తెలంగాణ ప్రజలను ఢిల్లీలోని మోడీ సర్కార్‌ ఘోరంగా అగౌరవ పరిచింది. ఆత్మగౌరవం కోసమే ఆరు దశాబ్ధాలపాటు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ పట్ల కించపరిచేలా వ్యవహరించింది. ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు రానున్న సమయంలో గతంలో అనుసరించిన సంప్రదాయాలకు కేంద్రం తిలోదకాలు ఇచ్చింది. సహజంగా ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు విమానాశ్రయం దగ్గర  రాష్ట్ర ప్రజల తరఫున గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు స్వాగతం పలుకుతారు. ఈ సారి కూడా అలాగే చేయాలని సీఎం కేసీఆర్‌ భావించారు. ఇవాళ హకీంపేట విమానాశ్రయానికి చేరుకునే ప్రధాన మంత్రికి.. సీఎం కేసీఆర్ స్వాగతం పలుకుతారని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రధాన మంత్రి కార్యాలయానికి సమాచారమిచ్చింది. దీనికి స్పందనగా ప్రధాన మంత్రి కార్యాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం సాయంత్రం ప్రత్యేక సమాచారం అందింది. ప్రధాన మంత్రికి స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదని ప్రధాన మంత్రి వ్యక్తిగత సహాయకుడు వివేక్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు ఫోన్ చేసి చెప్పారు..

హైదరాబాద్‌ పర్యటనలో ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు కేవలం ఐదుగురికి మాత్రమే పీఎంవో అవకాశం ఇచ్చింది. హకీంపేట ఎయిర్ ఆఫిస్ కమాండెంట్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ శ్వేత మహంతి, సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాత్రమే హకీంపేట విమానాశ్రయానకి రావాలని పిఎంవో ఆదేశాలు పంపింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం అవాక్కయ్యింది. గతంలో ఏ ప్రధాన మంత్రి అయినా రాష్ట్రాల్లో అధికారిక  పర్యటనకు వస్తే గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు స్వాగతం పలుకడం ఆనవాయితీగా ఉంది.  కానీ ఈ సారి స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదని ప్రధాన మంత్రి కార్యాలయం వారించింది. ప్రధాన మంత్రి కార్యాలయం నుండి గతంలో ఇలాంటి ఆదేశాలు ఎన్నడూ రాలేదని, ఇలా ఎందుకు చేశారో అర్ధం కావడం లేదని సీనియర్ అధికారులు చెబుతున్నారు

అటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతున్న తరుణంలో ప్రధాని మోడీ హఠాత్తుగా హైదరాబాద్‌ పర్యటన పెట్టుకోవడంపై రాజకీయ వర్గాల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ అగ్రనేతలంతా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సమయంలో భారత్‌ బయోటెక్‌ కంపెనీ తయారు చేసే వ్యాక్సిన్‌ పురోగతిని పరిశీలించేందుకు ప్రధాని మోడీ ఇప్పుడు పర్యటన పెట్టుకోవడం ఆసక్తిని రేకెత్తించింది. పైగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తన పర్యటనకు దూరంగా ఉంచడం నివ్వెర పరిచింది. మోడీ ప్రధాని హోదాలో ఇక్కడికి వస్తున్నారా. లేక బీజేపీ నేతగా ఇక్కడకు వస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్‌ బయోటెక్‌ సహా హైదరాబాద్‌ ఫార్మా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు, కల్పించిన మౌలిక సదుపాయాలే కారణం.. అందువల్చే ఇవాళ మొత్తం దేశానికి.. చివరికి ప్రపంచానికి సైతం వ్యాక్సిన్‌ అందించే సామర్థ్యాన్ని హైదరాబాద్‌ సంతరించుకున్నది. దీన్ని విస్మరించిన కేంద్రం వ్యాక్సిన్‌ పురోగతి పరిశీలన పేరుతో క్రెడిట్‌ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకునేలా వ్యవహరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో పాత్ర లేదని చాటిచెప్పాలన్నట్టుగా వారి వ్యవహారశైలి ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తున్నది..

ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల కేంద్రం వ్యవహరించిన తీరుపై యావత్ తెలంగాణ సమాజం భగ్గుమంటోంది.ఆత్మగౌరవాన్ని కించపర్చేలా వ్యవహరించిన బీజేపీకి తగిన శాస్తి తప్పదని హెచ్చరిస్తోంది.

- Advertisement -

Latest news

Related news

కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన కిసాన్‌మోర్చా

కొత్త సాగు చట్టాలను తాత్కాలికంగా 18 నెలలపాటు నిలిపివేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సంయుక్త కిసాన్‌మోర్చా కార్యవర్గం తిరస్కరించింది. మూడు వివాదాస్పద సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు...

నల్గొండ రోడ్డు ప్ర‌మాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

నల్గొండ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాలపాలై...

ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పేర్కొంది. కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల...

రూ.190కే ల్యాప్‌టాప్‌.. ఆర్డర్ చేస్తే..

అమెజాన్‌ సైట్‌లో రూ.23,499 విలువైన ల్యాప్‌టాప్‌ కేవలం రూ.190కే ఆఫర్‌ కింద అందుబాటులో ఉండటంతో ఒడిశాకు చెందిన సుప్రియో రంజన్‌ మహాపాత్ర అనే లా స్టూడెంట్ ఆర్డర్ చేశాడు. అయితే,...