వర్షమంటే 3 నెలల ముచ్చటే అనుకుంటుంటాం… కానీ, ఈ సీజన్లో కురిసిన వర్షం.. 33 ఏండ్ల రికార్డులను తుడిచేసింది. ఈ వర్షాకాలంలో సాధారణం కంటే సుమారు 45% అధిక వర్షపాతం నమోదైంది. వాతావరణశాఖ లెక్కల ప్రకారం సెప్టెంబర్ 30వ తేదీకే వానాకాలం ముగిసినా.. నైరుతి రుతుపవనాలు ఇంకా చురుకుగానే ఉన్నాయి. వరుస అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో గత సీజన్ వరకు అత్యధికంగా 1988లో 83.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ ఏడాది వర్షాకాలంలో ఏకంగా 110.2 సెంటీమీటర్ల వర్షం కురిసి 33 ఏండ్ల కిందట నమోదైన రికార్డులను తుడిచేసింది. ఆగస్టులో 78శాతం, సెప్టెంబర్లో 94 శాతం అధిక వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నగరంలో ఈ సీజన్ లో 48శాతం అధిక వర్షపాతం నమోదైంది. సాధారణంగా 56.21 సెంటీమీటర్ల వర్షం కురవాల్సిఉండగా.. ఈసారి 82.97 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలో 14 రోజుల్లో సాధారణం కంటే 404 శాతం అధిక వర్షాలు కురిశాయి.
నైరుతి రుతుపవనాలు చురుకుగా కదిలేందుకు ఈ ఏడాది వరుస అల్పపీడనాలు, షీర్జోన్లు బాగా కలిసివచ్చాయి. వీటి ద్వారానే రికార్డుస్థాయిలో వర్షాలు కురిశాయి. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అత్యధిక వానలు కురిశాయి.జూన్, జూలైలో ఒక్కొక్కటి చొ ప్పున అల్పపీడనం ఏర్పడగా, ఆగస్టులో ఏకంగా ఐదు, సెప్టెంబర్లో మూడు ఏర్పడ్డాయి. ఈ నెలలోనూ రెండు ఏర్పడ్డాయి. ప్రస్తుతం కురుస్తున్నవి పోస్ట్ మాన్సూన్ వర్షాలని అధికారులు చెప్తున్నారు. వరుస అల్పపీడనాలతో తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఇంకా చురుకుగానే ఉన్నాయి. రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభం కాలేదని… వచ్చేవారం వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ ఏడాది వర్షాకాలం 120 రోజుల్లో 82 రోజులు వర్షాలే కురిశాయి. ఈ సీజన్లో నెలలవారీగా చూస్తే జూన్లో 16 రోజులు, జూలైలో 24 రోజులు, ఆగస్టులో 25 రోజులు, సెప్టెంబర్లో 17 రోజులు కలిపి మొత్తం 82 వర్షపు రోజులు నమోదయ్యాయి. ఈ సీజన్ లో దినసరి సగటు వర్షపాతం 13.2 మిల్లీ మీటర్లుగా నమోదైంది. ఇది కూడా ఒక రికార్డే. ఈ సీజన్లో అక్టోబర్ 13న 32 సెంటీ మీటర్లతో అత్యధిక వర్షం కురిసిన ప్రాంతంగా మేడ్చల్ మల్కాజిగిరి లలోని ఘట్కేసర్ రికార్డు నమోదు చేసింది. హైదరాబాద్కు వస్తే అక్టోబర్ 14న బేగంపేట్లో 19.2 సెం.మీ. అత్యధిక వర్షం కురిసింది.