26.4 C
Hyderabad
Monday, October 26, 2020

నగరంలో మరో 45 బస్తీ దవాఖానలు

మన బస్తీలో.. ఇంటి పక్కనే వైద్యం.. అదీ ఉచితంగా.. ఇప్పటికే నగరంలోఅందుబాటులో ఉన్న బస్తీ దవాఖానలు మరింత విస్తృతం అవుతున్నాయి. శుక్రవారం కొత్తగా మరో 45 వైద్యశాలలను మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌ ప్రారంభిస్తారు. వీటి కోసం భవన నిర్మాణాలు పూర్తి చేసి సిబ్బందిని నియమించారు. కాగా గ్రేటర్‌లో ఇప్పటికే 123 బస్తీ దవాఖానలు సేవలందిస్తున్నాయి. నిత్యం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీతో పాటు వైద్య పరీక్షలు చేసి మందులు  అందిస్తున్నారు.

నమస్తే తెలంగాణ-సిటీబ్యూరో: గ్రేటర్‌లో సర్కారీ వైద్యం మరింత చేరువ కానున్నది. అట్టడుగు, పేద వర్గాలకు  వైద్య సేవలు అందించే ఉద్దేశంతో ఇప్పటికే 123 దవాఖానలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం కొత్తగా మరో 45 బస్తీ వైద్యశాలలను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే భవన నిర్మాణ పనులను పూర్తి చేసిన అధికారులు వైద్య పరికరాలనూ ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. సిబ్బంది నియామక ప్రక్రియను సైతం పూర్తి చేసి ఆరోగ్య సేవలు ప్రారంభించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. శుక్రవారం మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి బస్తీ దవాఖానలను ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాటు చేశారు. 

గ్రేటర్‌ పరిధిలో 123 దవాఖానలు.. 

గ్రేటర్‌ పరిధిలో 123 బస్తీ దవాఖానలుండగా ఇందులో  హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 74, రంగారెడ్డి పరిధిలో 23, మేడ్చల్‌లో 26 ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఆరోగ్య కేంద్రాల్లో ఓపీతో పాటు వైద్య పరీక్షలు చేసి మందులు అందిస్తుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  సాధారణంగా రోజువారీ పనులు చేసుకునే ప్రజలు చిన్నపాటి జలుబు, దగ్గు, ఇతర సమస్యలు ప్రారంభ దశలో ఉన్నప్పుడు పెద్దగా పట్టించుకోకపోవడం, లేదా మెడికల్‌ షాపుకెళ్లి నాలుగు మందుబిల్లలు తీసుకోవడం వంటివి చేస్తుంటారు. తీరా రోగం ముదిరాక పెద్ద దవాఖానలకు పరుగులు తీస్తుండడంతో  కోరంటి, ఉస్మానియా, గాంధీ దవాఖానలపై భారం పెరిగేది. అయితే బస్తీ దవాఖానలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏ చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే రోగులు వాటిని ఆశ్రయిస్తున్నారు. దీంతో వానకాలంలో వచ్చే డెంగీ, మలేరియా, వైరల్‌ ఫీవర్‌, డయేరియా, కలరా, చికున్‌గున్యాకు ఆదిలోనే అడ్డుకట్ట పడుతున్నది. అంతేకాక పెద్ద దవాఖానలకు వెళ్లి క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించాల్సిన బాధ తప్పుతున్నది. బోధనా వైద్యశాలలైన ఉస్మానియా, గాంధీలపై భారం తగ్గుతున్నది. అంతకంటే ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ రోగాలను నియంత్రించడం సాధ్యమవుతున్నది.

ఆపత్కాలంలో ఆదుకున్న బస్తీ దవాఖానలు.. 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు ప్రైవేట్‌ దవాఖానలు పూర్తిగా మూతపడిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ దవాఖానాల్లో అత్యవసర, ఓపీ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ రవాణా సౌకర్యం లేకపోవడంతో రోగులు ఉస్మానియా, నిలోఫర్‌ లాంటి వైద్యశాలలకు వెళ్లలేకపోయారు. ఈ ఆపత్కాల సమయంలో బస్తీ దవాఖానాలే ఆదుకున్నాయి. 

55 రకాల వైద్య పరీక్షలు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏదైనా వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే డయాగ్నోస్టిక్‌ సెంటర్లన్నీ మూసి ఉన్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బస్తీ దవాఖానలు అన్నీ తామై సేవలందిస్తున్నాయి. ఇక్కడ రోగులకు బీపీ, షుగర్‌, మలేరియా, టైఫాయిడ్‌ లాంటి 55 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తూ 125 రకాల మందులను అందుబాటులో ఉంచినట్లు వైద్యాధికారులు తెలిపారు.

500 బస్తీ దవాఖానల ఏర్పాటే లక్ష్యం 

-మేయర్‌ బొంతు రామ్మోహన్‌ 

కవాడిగూడ: సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నగరంలో 500 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ కృషి చేస్తున్నదని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు. గురువారం కవాడిగూడ డివిజన్‌ పరిధి దోమలగూడ రోజ్‌కాలనీలో ప్రారంభించనున్న బస్తీ దవాఖాన ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవసరమైన చోట అనువైన ప్రదేశాల్లో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉచిత పరీక్షలు, ఉచిత మందుల పంపిణే ధ్యేయంగా బస్తీ వైద్యశాలలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రోజ్‌ కాలనీలో ఏర్పాటు చేయబోయే బస్తీ దవాఖానను డిప్యూటీ స్పీకర్‌ టి.పద్మారావు ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంసీ ఉమాప్రకాష్‌, కార్పొరేటర్‌ లాస్యనందిత, జీహెచ్‌ఎంసీ వైద్యాధికారి హేమలత, డీఈ ప్రసాద్‌, ఏఈ గౌతమ్‌ పాల్గొన్నారు.

కొత్త బస్తీ దవాఖానలు ఇవే…

చార్మినార్‌ జోన్‌…

మిలత్‌నగర్‌, నిమ్రాకాలనీ, చాంద్రాయణగుట్ట, సైదాబాద్‌, డా.జాఖీర్‌ హుస్సేన్‌ కాలనీ, క్యాలెండర్‌ నగర్‌ కమ్యూనిటీహాల్‌, రాజేంద్రనగర్‌, కొండాపూర్‌.

ఖైరతాబాద్‌…

కమాటిపుర కమ్యూనిటీహాల్‌, జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీహాల్‌, హనుమన్‌టేక్డీ, ఎన్‌.బీ నగర్‌, బంజారాహిల్స్‌, ఇంద్రనగర్‌ జీవైఎం సెంటర్‌, వెంకటేశ్వరనగర్‌,అంబికా మహిళా మండలి, కమ్యూనిటీహాల్‌, జూబ్లీహిల్స్‌, పీజేఆర్‌ నగర్‌ కమ్యూనిటీహాల్‌, బీసీ వడ్డెర బస్తీ కమ్యూనిటీహాల్‌, ఎంజీ నగర్‌, దత్తాత్రేయణ, ఆసిఫ్‌నగర్‌, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, భోజగుట్ట.

సికింద్రాబాద్‌

శివాజీనగర్‌ కమ్యూనిటీ హాల్‌, డొక్కాలమ్మ దేవాలయం, చేపలబాయ్‌, మోండామార్కెట్‌, విజయపురి కాలనీ, తార్నాక, డీ.ఎస్‌ నగర్‌, కవాడిగూడ,ఉమదానగర్‌ కమ్యూనిటీ హాల్‌

కూకట్‌పల్లి

ద్వారకానగర్‌, కుత్బుల్లాపూర్‌, అంబేద్కర్‌ నగర్‌, కొత్తబస్తీ, మహిళామండలి భవన్‌, కుషాయిగూడ, రంగారెడ్డి నగర్‌, కుత్బుల్లాపూర్‌

కేపీహెచ్‌బీ ఫేస్‌-4, కేపీహెచ్‌బీ కాలనీ, అల్వాల్‌, అరుంధతి, కమ్యూనిటీ హాల్‌, తుర్కపల్లి, మోడల్‌ మార్కెట్‌, భగత్‌సింగ్‌నగర్‌, చింతల్‌, నందన నగర్‌, రంగారెడ్డి, వెంకటేశ్వర కమ్యూనిటీ హాల్‌.

ఎల్‌బీనగర్‌

అశోక్‌నగర్‌, సింగం చెరువు, వివేకానందనగర్‌, కాప్రా, కమలానగర్‌ కమ్యూనిటీ హాల్‌, కుషాయిగూడ, సాయిరాంనగర్‌ కమ్యూనిటీహాల్‌, కుషాయిగూడ,సాహెబ్‌నగర్‌,బీఎన్‌రెడ్డి కాలనీ, సరూర్‌నగర్‌, అధికారి నగర్‌, సరూర్‌నగర్‌,కామేశ్వరరావు కాలనీ

శేరిలింగంపల్లి

పటాన్‌చెరు, చైతన్యనగర్‌ కాలనీ, కనుకుంట, గవర్నమెంట్‌ స్కూల్‌, ఆర్సీ పురం, ప్రేమ్‌నగర్‌ కమ్యూనిటీ హాల్‌, కొండాపూర్‌, కార్మికనగర్‌ కమ్యూనిటీహాల్‌, రామంతానగర్‌, యాదగిరినగర్‌ కమ్యూనిటీహాల్‌, సుల్తాన్‌నగర్‌ కమ్యూనిటీహాల్‌, ఎర్రగడ్డ

- Advertisement -

Latest news

Related news

జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ జియాగూడలోని పేదలకు ప్రభుత్వం దసరా కానుక అందజేసింది. అంబేద్కర్ నగర్ లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 840 రెండు పడక...

దేశంలో 79లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా తీవ్రత తగ్గుతుందని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 79లక్షలకు చేరువైంది. గత 24గంటల్లో 45వేల 149కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల...

పాకిస్థాన్‌లో భూకంపం

పాకిస్థాన్‌లో ఇవాళ‌ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీనితీవ్ర‌త రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్ర‌క‌టించింది. ఈరోజు ఉద‌యం 4.14 గంటలకు భూకంపం సంభవించింద‌ని, భూ...