కరోనా నేపథ్యంలో అయిదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ మెట్రో రైలు సేవలు నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి. నాగోల్ – రాయదుర్గం మధ్య మెట్రో సేవలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు రైళ్లు నడవనున్నాయి. కంటైన్మెంట్ జోన్లు ఉన్న ప్రాంతాల్లో మెట్రోస్టేషన్లు మూసివేయనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో సామాజిక దూరం పాటించేలా, స్టేషన్లు, రైళ్లలో మార్కింగ్ ఏర్పాటు చేశారు. నిత్యం స్టేషన్ పరిసరాలు, రైళ్లను సిబ్బంది శానిటైజ్ చేస్తున్నారు.