24.3 C
Hyderabad
Wednesday, November 25, 2020

నాయిని నరసింహారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

తెలంగాణ మాజీ హోం శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత నాయిని నరసింహారెడ్డి కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత నెల 28వ తేదీన కరోనా బారినపడిన ఆయన సిటీ న్యూరో సెంటర్‌ దవాఖానలో 16 రోజుల పాటు చికిత్స పొందారు. వారం రోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగిటివ్‌ వచ్చినప్పటికీ ఊపిరితిత్తుల్లో ఇన్‌ ఫెక్షన్‌ సోకడంతో కుటుంబసభ్యులు అపోలోకు తరలించారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌ పై చికిత్స పొందారు. బుధవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ అపోలో ఆసుపత్రిలో నాయినిని పరామర్శించారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. కానీ రాత్రి పొద్దుపోయాక నాయిని ఆరోగ్యం మరింత క్షీణించడంతో.. 12గంటల25 నిమిషాలకు మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు.

నాయిని నర్సింహా రెడ్డి 12 మే 1934 లో నల్గొండ జిల్లాలోని నేరేడుగోమ్ము గ్రామంలో రైతు దంపతులైన దేవయ్య రెడ్డి, సుభద్రమ్మలకు జన్మించారు. ఆయనకు భార్య అహల్యారెడ్డి, కొడుకు దేవేందర్‌ రెడ్డి, కుమార్తె సమతా రెడ్డి ఉన్నారు. హెచ్‌ఎస్‌సీ వరకు విద్యను అభ్యసించిన నాయిని..1969లో జయప్రకాశ్‌ నారాయణ శిష్యుడిగా జనతాపార్టీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1978, 1985లో జనతాపార్టీ తరఫున ముషీరాబాద్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో టీఆర్ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది.. నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2014 జూన్‌ 2న ఏర్పడిన టీఆర్ఎస్‌ ప్రభుత్వంలో రాష్ట్ర మొదటి హోంశాఖ మంత్రిగా పనిచేశారు. గవర్నర్‌ కోటాలో శాసనమండలికి ఎంపికైన ఆయన పదవీకాలం 2020 ఏప్రిల్‌ తో ముగిసింది. నాయిని నర్సింహారెడ్డి టీఆర్ఎస్‌ పార్టీని స్థాపించిన నాటి నుంచి తుదిశ్వాస విడిచేవరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటే నడిచారు.

1970లో హైదరాబాద్‌ వచ్చిన నాయిని నర్సింహారెడ్డి ముషీరాబాద్‌ నియోజకవర్గం సమీపంలోని బర్కత్‌ పురలో స్థిరపడ్డారు. హైదరాబాద్‌ కేంద్రంగా కార్మిక ఉద్యమాలు చేసిన ఆయన.. నాడు ముంబైలో రిక్షాపుల్లర్‌ యూనియన్‌ కు కూడా నాయకత్వం వహించారు. 1977 ఎమర్జెన్సీ సమయంలో హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, ముంబై తదితర ప్రాంతాల్లో పలు ఆందోళనల్లో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో రైల్వే చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సంపూర్ణ రైల్వేబంద్‌ ను జయప్రదం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. హైదరాబాద్‌ లోని వీఎస్టీలో దేశంలోనే మొట్టమొదటిసారిగా కార్మికుల కోసం రవాణా, క్యాంటీన్‌ వసతిని ఏర్పాటుచేయించారు. హైదరాబాద్‌ లోని వీఎస్టీలో కార్మికనేతగా ప్రత్యేక గుర్తింపు పొందిన నాయిని.. కార్మికుల కోసం ఆలుపెరుగని పోరాటం చేశారు. హైదరాబాద్‌ తో పాటు శివారులోని పలు కంపెనీల్లో ఆయన కార్మిక సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. వీఎస్టీలో కార్మిక సంఘానికి సలహాదారుడిగా కొనసాగుతున్న నాయిని.. కార్మికుల సంక్షేమం కోసం చివరిదాకా పాటుపడ్డారు.

నాయిని మృతిపట్ల సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిరకాల మిత్రులు, ఉద్యమ సహచరున్ని కోల్పోయానన్నారు. నాయిని మృతి టీఆర్ఎస్‌ పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి, కార్మిక లోకానికి తీరనిలోటన్నారు.

- Advertisement -

Latest news

Related news

భారత్‌ లో 92లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో బాధితుల సంఖ్య 92లక్షలు దాటింది. నిన్నటికి నిన్న 44 వేల 376 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి పటేల్‌ చేసిన కృషిని కొనియాడారు. ఆయన చాలా కాలంపాటు ప్రజా...