21.7 C
Hyderabad
Friday, January 22, 2021

నిఖార్సయిన హిందుత్వానికి నిర్వచనం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ గొప్ప హిందువు. సీఎం కేసీఆర్‌ చేసే యజ్ఞయాగాది క్రతువులు తాను ఎలాంటివారో చెప్పక్కనే చెబుతాయి. కేసీఆర్‌ చేపట్టిన ఏ పనిలోనైనా ఆధ్యాత్మికత ఉంటుంది. అయుత చండీయాగం నుంచి యాదాద్రి ఆలయ నిర్మాణం వరకు ఎన్నో కార్యక్రమాలు సీఎం కేసీఆర్‌ హిందుత్వాన్ని దశదిశలా చాటి చెప్పాయి. అదే సమయంలో పరమతసహనాన్ని ప్రదర్శించిన మహానేతగా సీఎం  కేసీఆర్‌ అందరి గుండెల్లో నిలిచిపోయారు. అన్ని మతాలను సమానంగా చూస్తున్న గొప్ప నేతగా పేరు తెచ్చుకున్నారు. 

సరస్వతి నదీతీరంలో పురుడుపోసుకొని ఆసేతు హిమాచల పర్యంతం విస్తరించి అఖండ భారతవర్ష పరివ్యాప్తమైంది హిందూజాతి. ఓంకారాత్మకమైన హిందూ మతం సర్వమానవ శ్రేయస్సును కోరుకొన్నది. సర్వేజనాఃసుఖినోభవంతు అంటూ వేదపురుషుడు నినదించాడు. ఈ ధర్మసూత్రాన్ని ఆచరణలో చేసిచూపిస్తున్న పాలకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రమే. జిల్లాలకు ప్రాజెక్టులకు దేవుళ్ల పేర్లు పెట్టడం మొదలుకొని చండీ యాగాలు నిర్వహించడం దాకా, చివరికి స్వతంత్ర భారత చరిత్రలో ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో 2 వేల కోట్ల రూపాయల ఖర్చుతో యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించటం కేసీఆర్‌ దైవ భక్తికి చరిత్రలో నిలిచిపోయే సాక్ష్యాలు. ఓట్ల కోసమే హిందూ మతాన్ని వాడుకునే వారికి ఆయన ధార్మికత అర్థం కాకపోవడంలో వింతేముంది?..

సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌లు, రిజర్వాయర్‌లకు హిందూ దేవతల పేర్లే పెట్టారు. మేడిగడ్డ  లక్ష్మీ బరాజ్‌, అన్నారం  సరస్వతి బరాజ్‌, సుందిళ్ల పార్వతి బరాజ్‌, రామడుగు  గాయత్రి పంపుహౌస్‌, మిడ్‌ మానేరు శ్రీరాజరాజేశ్వర,అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్‌, మల్లన్నసాగర్‌, తపాస్‌పల్లి కొండపోచమ్మ సాగర్‌ ఇలా వాటికి పేర్లు పెట్టారు.  తుపాకులగూడెం సమ్మక్క బరాజ్‌,దుమ్ముగూడెం  సీతమ్మ సాగర్‌ పేర్లతోనూ ప్రాజెక్టులు చేపట్టారు. ఇక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటు, వాటి పేర్లలో హిందుత్వం ఉట్టిపడుతోంది.   యాదాద్రి భువనగిరి, జోగుళాంబ గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల జిల్లాల పేర్లు ఇందుకు ఉదాహరణ…

తెలంగాణ సస్యశ్యామలం కావడంతోపాటు ఆధ్మాత్మికత వెల్లివిరియాలన్నది కేసీఆర్‌ సంకల్పం. దానికి అనుగుణంగానే యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ ఆలయాల పునర్నిర్మాణం చేపట్టారు. కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధికి పూనుకొన్నారు. రాష్ట్రం బయట పుణ్యక్షేత్రాల గురించి కూడా కేసీఆర్‌ ఆలోచించారు. తెలంగాణలో లక్షలమంది కఠోరదీక్షతో పూజించే శబరిమలలో మన భక్తులకోసం విడిది ఉండాలనే ఆలోచన కేసీఆర్‌ తప్ప మరెవరు చేయగలరు? కేరళను యూడీఎఫ్‌ పాలిస్తున్న సమయంలో ఆనాటి సీఎం ఏకే ఆంటోనీతో స్వయంగా ఆ విషయం మాట్లాడారు. ఆ తర్వాత వచ్చిన ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వంతో అనేకసార్లు సంప్రదిస్తే కేరళ ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఒక నికార్సయిన హిందువు తప్ప ఇంతగా ఆలోచించగలవారెవ్వరు? బీజేపీ ఆధ్వర్యంలో అనేక రాష్ర్టాలున్నాయి. ఏ ముఖ్యమంత్రి ఈ దిశగా ఆలోచించలేదు. .

ఆధ్యాత్మిక రంగంలో కేసీఆర్‌ శైలి సంచలనం. ప్రభుత్వం తరఫున తిరుపతి వెంకన్నకు ఆభరణాలు, బెజవాడ కనకదుర్గమ్మకు ముక్కుపుడక, వరంగల్‌ భద్రకాళిఅమ్మవారికి కిరీటం, కొమురవెల్లి మల్లన్నకు కోరమీసాలు సమర్పించారు. విమర్శలు లెక్కించలేదు. వెక్కిరింతలకు చలించలేదు. అంతేకాదు కొందరు మూర్ఖుల ప్రచారం కారణంగా ‘పదవిలో ఉన్న నాయకుడు దర్శిస్తే పదవి పోతుందనే అపప్రధను మోస్తున్న వేములవాడ రాజేశ్వరుడి’ని ఎలాంటి జంకూగొంకూ లేకుండా కుటుంబ సమేతంగా దర్శించి మొక్కులు చెల్లించుకొని ఆలయం మీద కమ్ముకున్న అపప్రథను పటాపంచలుచేసిన పరిపూర్ణ హిందువు కేసీఆర్‌. సమకాలీన రాజకీయాల్లో ఆధ్యాత్మిక భావనను ఎలాంటి శషభిషలు లేకుండా పాటిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరే. తాను నమ్మిన పద్ధతులను, విశ్వాసాలను ధైర్యంగా పాటిస్తున్న ముఖ్యమంత్రికూడా కేసీఆర్‌ ఒక్కరే.  మతముద్ర భయంతో ఆధ్యాత్మిక అంశాల జోలికే వెళ్లని నాయకులు ఎందరో ఉన్నారు. ఓట్లభయంతో లౌకికతత్వం పేరిట నానా సాముగరిడీలు చేసే వారున్నారు. కానీ కేసీఆర్‌ మాత్రం నిజమైన హిందువుగా తన విశ్వాసాలను ఆచరిస్తూ పాలకుడిగా అన్ని మతాలను సమాదరించారు.

సీఎం కేసీఆర్‌  జరిపిన అయుత చండీయాగం ఒక చరిత్ర. రోజుల తరబడి యాగశాలకు లక్షల మంది తరలివస్తే.. అంతకు మించిన సంఖ్యలో ప్రజలు టీవీల్లో చూసి తరించారు. యాగం జరిగినన్ని రోజులు ఎన్నో విమర్శలు. అభాండాలు, ఆరోపణలు. వక్రీకరణలు. అయినా కేసీఆర్‌ దేనికీ చెక్కు చెదరలేదు. ప్రభువు ధార్మికుడైతే ప్రజలు ధర్మవర్తనులవుతారు. అయుత చండీయాగం అందరికీ ఆదర్శమైంది. ఆ యాగం తర్వాత రాష్ట్రం లోపల వెలుపలా అనేక చోట్ల యజ్ఞయాగాల నిర్వహణ పెరిగింది. ఇవాళ పలువురు నాయకులు బహిరంగంగా యజ్ఞయాగాలు నిర్వహిస్తున్నారంటే అది అయుత చండీయాగ మహిమే. హిందూమతం పేరుతో ఓట్లడుక్కొనే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఏ  ముఖ్యమంత్రీ ఇలాంటి యాగం గానీ ఆధ్యాత్మిక కార్యక్రమంగానీ  చేపట్టిన దాఖలాలు లేవు..

సీఎం కేసీఆర్‌ లౌకికతత్వం విశిష్టమైంది. తాను తన విశ్వాసాలను త్రికరణశుద్ధితో ఆచరిస్తూ ఇతర మతాలను వారి విశ్వాసాలను సమున్నతంగా ఆదరిస్తారు. అందుకే ఆయన యజ్ఞయాగాలు చేసినా.. ఆలయాల నిర్మాణాలు చేసినా ఏ ఇతర మతపెద్దలూ ఏనాడూ వేలెత్తి చూపలేదు. కేసీఆర్‌ మతవిశ్వాసాలు రాజకీయాలకు ముడిపడినవి కావు. ఆయనగాని ఆయన పార్టీగాని మత అంశాల ఆధారంగా ఏనాడూ ఓట్లు అడగలేదు. బీజేపీ ఏనాడూ రాజకీయాలకోసం తప్ప హిందువుల అసలు సమస్యలు తలకెత్తున్నది లేదు. జీర్ణస్థితిలో ఉన్న ఒక్క ఆలయాన్ని పట్టించుకున్నదీ లేదు. మత వివాదాలు రేకెత్తించే ఆలయాలు తప్ప ఆ పార్టీ ఎజెండాలో ఇతర ఆలయాలు ఎప్పుడూ ఉండవు.

- Advertisement -

Latest news

Related news

కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన కిసాన్‌మోర్చా

కొత్త సాగు చట్టాలను తాత్కాలికంగా 18 నెలలపాటు నిలిపివేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సంయుక్త కిసాన్‌మోర్చా కార్యవర్గం తిరస్కరించింది. మూడు వివాదాస్పద సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు...

నల్గొండ రోడ్డు ప్ర‌మాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

నల్గొండ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాలపాలై...

ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పేర్కొంది. కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల...

రూ.190కే ల్యాప్‌టాప్‌.. ఆర్డర్ చేస్తే..

అమెజాన్‌ సైట్‌లో రూ.23,499 విలువైన ల్యాప్‌టాప్‌ కేవలం రూ.190కే ఆఫర్‌ కింద అందుబాటులో ఉండటంతో ఒడిశాకు చెందిన సుప్రియో రంజన్‌ మహాపాత్ర అనే లా స్టూడెంట్ ఆర్డర్ చేశాడు. అయితే,...