కరోనా కారణంగా అర్థంతరంగా వాయిదా పడిన శాసనసభ ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కానుంది. జీహెచ్ఎంసీ సహా పలు చట్టాల సవరణ కోసం అసెంబ్లీ ఒకరోజు భేటీ కానుంది. ఉదయం 11.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. సభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. సభ ప్రారంభం కాగానే నేరుగా నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.
జీహెచ్ఎంసీలో వార్డుల రిజర్వేషన్లకు రోటేషన్ లేకుండా ప్రస్తుతమున్న వాటినే కొనసాగించే విధంగా చట్టాన్ని సవరించనున్నారు. నాలా చట్టం, రిజిస్ట్రేషన్ చట్టానికి కూడా ప్రభుత్వం సవరణ ప్రతిపాదించనుంది. నేర విచారణ స్మృతి-సీఆర్పీసీ చట్టానికి కూడా ప్రభుత్వం సవరణ బిల్లును ప్రవేశ పెట్టనుంది. బిల్లులపై చర్చ, ఆ వెంటనే వాటి ఆమోదం పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నించనుంది. మరోవైపు శాసనమండలి బుధవారం ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను మండలిలో కూడా చర్చించి ఆమోదించనున్నరు.
ఈ సమావేశాల ఏర్పాట్లపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సమీక్షించారు. అసెంబ్లీ సమావేశ మందిరాన్ని స్పీకర్ పోచారం, మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నర్సింహాచార్యులు పరిశీలించారు. సమావేశాలకు హాజరయ్యే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉభయ సభల సిబ్బంది, మీడియా ప్రతినిధులు, పోలీసులు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అటు సమావేశాల బందోబస్తు పై రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్, చీఫ్ సెక్రటరీతో స్పీకర్ పోచారం ఫోన్ లో మాట్లాడారు.