18.3 C
Hyderabad
Wednesday, October 28, 2020

పంట..పండాలి.. మన రైతన్న జేబు నిండాలి

 • నచ్చేలాగా.. నాణ్యత గీటురాయిగా.. గిరాకీ
 • చెప్పిన పంటనే అందరూ వేయాలి. అందరికీ రైతుబంధు రావాలి
 • మనరైతులు ప్రపంచంతో పోటీపడాలి
 • త్వరలో మార్కెటింగ్‌, ఆర్‌ఏఏ కమిటీలు 
 • అన్ని జిల్లాల్లో భూసార పరీక్షాకేంద్రాలు
 • పూర్తిస్థాయిలో క్రాప్‌ ఎన్యూమరేషన్‌
 • నాలుగైదు నెలల్లో రైతువేదికల నిర్మాణం
 • 4 రోజుల్లో క్లస్టర్లవారీగా రైతు సదస్సులు
 • జిల్లాలవారీగా వ్యవసాయకార్డుల జారీ
 • ప్రతి ఏటా తప్పనిసరిగా పంటల మార్పిడి
 • పత్తి మంచి లాభదాయకమైన పంట
 • యాసంగిలో మక్కలు వేసుకోవచ్చు
 • కందిచేనుతో బహుళ ప్రయోజనాలు 
 • ఆహారశుద్ధి సెజ్‌లలో.. అన్ని రకాల మిల్లులు
 • వాటికి సమీపంలోనే గోదాముల నిర్మాణం
 • పత్తి ఎక్కువ పండేచోట జిన్నింగ్‌ మిల్లులు
 • నియంత్రిత పంటల సాగు విధానంపై విస్త్రృత  సమావేశంలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నియంత్రిత పద్ధతిలో పంటలు సాగుచేసి, రాష్ట్రంలోని రైతులంతా వందకు వందశాతం రైతుబంధు సాయం, పండించిన పంటకు మంచి ధర పొందాలన్నది తన అభిమతమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. మార్కెట్‌లో మంచి డిమాండ్‌ కలిగిన, నాణ్యమైన పంటలు పండించడం ద్వారానే రైతులు మంచి ధర పొందగలుగుతారని వెల్లడించారు. ఏ పంట వేయడం ద్వారా మేలు కలుగుతుందనే విషయంలో వ్యవసాయశాఖ, వ్యవసాయ యూనివర్సిటీ తగు సూచనలు చేస్తుందని, దాని ప్రకారం పంట సాగుచేస్తే రైతుకు ఏ ఇబ్బందీ ఉండదని చెప్పారు. విభిన్న నేలలు, సమశీతోష్ణ వాతావరణం, మంచి వర్షపాతం, వృత్తి నైపుణ్యం కలిగిన రైతులు, రైతు పక్షపాత ప్రభుత్వంలాంటి అనుకూలతలను సద్వినియోగంచేసుకుని ప్రపంచంతో పోటీపడే గొప్ప రైతాంగంలా మారాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో విత్తనాల కల్తీలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, విత్తన కల్తీదారులు హంతకులతో సమానమని హెచ్చరించారు. కల్తీ విత్తనాలను ఎవరూ ప్రోత్సహించవద్దని, ప్రజాప్రతినిధులు కల్తీవిత్తన విక్రేతలను కాపాడే ప్రయత్నం చేయరాదని స్పష్టంచేశారు. నియంత్రిత పద్ధతిలో పంటలు సాగుచేసే విధానంపై చర్చించడానికి గురువారం ప్రగతిభవన్‌లో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, సీనియర్‌ అధికారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతుబంధు సమితుల అధ్యక్షులు, వ్యవసాయ వర్సిటీ అధికారులు, సైంటిస్టులు పాల్గొన్నారు. జిల్లాల నుంచి వచ్చిన అధికారులు, రైతుబంధు సమితుల అధ్యక్షులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. వారి అభిప్రాయాలు తెలుసుకొన్నారు. సందేహాలను నివృత్తిచేశారు. వారినుంచి సూచనలు స్వీకరించారు.  తెలంగాణ రాష్ట్ర జీవికలో వ్యవసాయం ప్రధానభాగమని, వ్యవసాయం భవిత ఉజ్వలంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రైతులు నాణ్యమైన ఉత్పత్తులు ప్రపంచానికి అందించడం ద్వారా లాభాలు గడించాలని ఆకాంక్షించారు. ‘రైతులంతా ఒకే పంట వేయడం ద్వారా డిమాండ్‌ పడిపోయి నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని నివారించడానికే ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఆలోచించి, నియంత్రిత పద్ధతిలో పంటలు సాగుచేయాలని రైతులకు సూచిస్తున్నది. ఏ సీజన్‌లో ఏ పంట వేయాలి? ఎక్కడ ఏ పంట సాగుచేయాలి? ఏ రకం సాగుచేయాలి? అనే విషయాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఏ పంటకు మార్కెట్లో డిమాండ్‌ ఉన్నదో ఆగ్రో బిజినెస్‌ విభాగం వారు తేల్చారు. దాని ప్రకారం ప్రభుత్వం రైతులకు తగు సూచనలు చేస్తున్నది. ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం పంటలు వేయడం వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉండదు’ అని సీఎం స్పష్టంచేశారు.

వానకాలంలో మక్కలు లాభసాటి కాదు

రాష్ట్రంలో గతేడాది వానకాలంలో వరి పంట 40 లక్షల ఎకరాల్లో సాగుచేశారని, ఈ సారి కూడా అంతే విస్తీర్ణంలో సాగుచేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. అదేవిధంగా గతేడాది 53 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేసారని, ఈ సారి కొంచెం పెంచి 70 లక్షల ఎకరాల్లో సాగుచేయాలన్నారు. ‘గతేడాది దాదాపు 7 లక్షల ఎకరాల్లో కంది సాగుచేశారు. ఈ సారి 15 లక్షల ఎకరాల్లో కంది సాగుచేయాలి. సోయాబీన్‌, పసుపు, మిర్చి, కూరగాయలు తదితర పంటలు గత ఏడాది మాదిరిగానే వేసుకోవచ్చు. వివిధ రకాల విత్తనోత్పత్తి చేసే రైతులు యథావిధిగా చేసుకోవచ్చు. పచ్చిరొట్టను విరివిగా సాగుచేసుకోవచ్చు. వానకాలంలో మక్కలసాగు లాభసాటి కాదు కాబట్టి, సాగు చేయవద్దు. యాసంగిలో మక్కలు సాగుచేసుకోవచ్చు. వానకాలంలో మక్కలు వేసే అలవాటున్న వారు పత్తి, కంది తదితర పంటలు వేసుకోవాలి. వరి వంగడాల విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్లో డిమాండ్‌ ఉన్న రకాలు వేసుకోవాలి. తెలంగాణ సోనాకు డిమాండ్‌ ఉన్నది. ఆ రకం పండించాలి. 6.5 మిల్లీమీటర్ల సైజు కలిగిన బియ్యం రకాలకు అంతర్జాతీయంగా మార్కెట్‌ ఉన్నది. కాబట్టి ఆ రకం పండించాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు.

రైతుబంధు సమితులు.. రైతులకు బంధువులు  

రైతులను సంఘటితశక్తిగా మార్చే సత్సంకల్పంతో ప్రభుత్వం రైతుబంధుసమితులను ఏర్పాటుచేసిందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ‘రైతుబంధు అన్నది పేరుకు మాత్రమే రైతుబంధు కాదు.. నిజంగానే ఈ సమితులు రైతులకు బంధువులుగా మారాలి. విత్తనంవేసే దగ్గర నుంచి పంట అమ్ముడుపోయే వరకు ప్రతి సందర్భంలోనూ రైతులకు సహాయకారులుగా, సమన్వయకర్తలుగా వ్యవహరించాలి. రాబోయే నెలరోజులపాటు రైతుబంధు సమితుల బాధ్యులు విస్తృతంగా పర్యటించి రైతులకు అవగాహన కల్పించాలి. ఒక యజ్ఞంలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. జిల్లా రైతుబంధు అధ్యక్షుడు విస్తృతంగా పర్యటించడానికి వాహన సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 25 లోగా ఖాళీగా ఉన్న వ్యవసాయ విస్తరణాధికారుల పోస్టుల భర్తీ కావాలి’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 

డిమాండ్‌.. నాణ్యతే కీలకం

పంటసాగు చేసేటప్పుడు రెండు విషయాలు పరిగణనలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. మొదటిది డిమాండ్‌ కలిగిన పంటలు పండించాలని, రెండోది.. నాణ్యమైన పంటలను ఉత్పత్తిచేయాలన్నారు. అప్పుడే రైతుకు మంచి ధర వస్తుందని పేర్కొన్నారు. మంచి వంగడాలు తయారుచేయడానికి.. మార్కెట్‌ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొనేందుకు వ్యవసాయశాఖలో మార్కెటింగ్‌ కమిటీ, రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ కమిటీలను ప్రభుత్వం అతి త్వరలోనే నియమిస్తుందని ప్రకటించారు. ‘వానకాలంలో మక్కలసాగు ఏమాత్రం మంచిది కాదు. వానకాలంలో మక్కల దిగుబడి 25 క్వింటాళ్లు మాత్రమే వస్తుంది. అదే యాసంగిలో పండిస్తే 35 క్వింటాళ్ల వరకు వస్తుంది. వానకాలంలో మక్కల సాగువల్ల ఎకరాకు రూ.25 వేల ఆదాయమే వస్తుంది. పత్తి పండిస్తే రూ.50 వేల ఆదాయం వస్తుంది. తెలంగాణలో మక్కల అవసరం 25 లక్షల టన్నులే ఉన్నది. అది యాసంగి పంటతో సమకూరుతుంది. నియంత్రిత పంటలు సాగుచేయాలన్న నిర్ణయాన్ని రాష్ట్రంలో అత్యధిక రైతులు స్వాగతిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఇది మంచి పరిణామం. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ విధానం వల్ల రైతులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వానికి కావాల్సింది ఇదే. ఎన్నో వేల కోట్లు ఖర్చుపెట్టి, ఎంతో శ్రమకోర్చి ప్రాజెక్టులు నిర్మించాం. దానివల్ల పంటలు బాగా పండుతాయి. పండిన పంటకు మంచి ధర వచ్చినప్పుడే రైతులకు లాభం. అందుకోసమే ప్రభుత్వం ప్రయత్నంచేస్తున్నది’ అని సీఎం వివరించారు.

ఆహారశుద్ధి సెజ్‌లలో అన్ని మిల్లులు 

రైతులు పండించిన పంటలకు మంచి ధర రావడంకోసమే పెద్ద ఎత్తున ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను, సెజ్‌లను ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్నదని సీఎం వెల్లడించారు. ‘ఈ సెజ్‌లలో రైస్‌ మిల్లులు, పప్పు మిల్లులు, నూనె మిల్లులు, ఇతర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు వస్తాయి. సెజ్‌లకు అవసరమైన స్థలాల ఎంపికను ఆయా జిల్లాల అధికారులు త్వరగా పూర్తిచేయాలి. సెజ్‌ల పక్కనే గోదాముల నిర్మాణంచేపట్టాలి. సెజ్‌లు, గోదాములన్న ప్రాంతాల్లో ఇండ్ల లే అవుట్లకు అనుమతి ఇవ్వొద్దు. కొత్తగా ఏర్పాటైన 125 మండలాల్లో గోదాములు రావాలి. ప్రతి గోదాములో కచ్చితంగా కొంత కోల్డ్‌ స్టోరేజీ సౌకర్యం ఉండాలి’ అని సీఎం సూచించారు. 

దీర్ఘకాలిక వరి రకాలు వేయాలి

గోదావరి ప్రాజెక్టుల కింద సత్వరం నీరు వచ్చే ప్రాంతంలో దీర్ఘకాలిక వరి రకాలు సాగుచేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. కృష్ణా ప్రాజెక్టు పరిధిలో ఆలస్యంగా నీరు వచ్చే ప్రాంతాల్లో స్వల్పకాలిక వరి రకాలు వేసుకోవాలన్నారు. ‘వ్యవసాయాధికారులు సూచించిన రకాలు వాడటం వల్ల మంచి దిగుబడి, ధర వస్తుంది. కంది వల్ల బహుళ ప్రయోజనాలున్నా యి. ప్రభుత్వమే కనీస మద్దతు ధర చెల్లించి కందులు కొనుగోలుచేస్తుంది. కందిచేనులో కంది ఆకు బాగా రాలడం వల్ల భూమికి మంచి ఎరువుగా మారుతుంది. భూసారం పెరిగి, తర్వాత వేసిన పంటలో దిగుబడి పెరుగడానికి ఉపయోగపడుతుంది. కందిలో తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి వచ్చే విత్తనాలు వచ్చా యి. వాటిని విత్తుకోవాలి. పత్తికి మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉన్నది. తెలంగాణలోనే కోటి బేళ్ల సామర్థ్యం కలిగిన 320 జిన్నింగ్‌ మిల్లులున్నాయి. 70 లక్షల ఎకరాల్లో సాగుచేసినా మద్దతు ధరకు ఢోకా ఉండదు. పత్తి ఎక్కువ పండి, జిన్నింగ్‌ మిల్లులులేని ప్రాంతాలు గుర్తించి, అక్కడ కొత్త మిల్లులు వచ్చేలా పరిశ్రమలశాఖ చొరవ చూపాలి. రాష్ట్రంలో పచ్చిరొట్ట ఎరువు సాగును ప్రోత్సహించాలి’ అని సీఎం పేర్కొన్నారు. 

మంత్రులు కొత్త వంగడాలు సాగుచేయాలి 

వ్యవసాయంలో అనేక ఆధునిక పద్ధతులు, కొత్త వంగడాలు వస్తున్నాయని, వాటిని అందిపుచ్చుకొనే విషయంలో సాధారణ రైతులకు అంత చొరవ ఉండదు కాబట్టి, మంత్రులు, రైతుబంధు సమితుల బాధ్యులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఆధునిక పద్ధతులు, కొత్త వంగడాల సాగుకు పూనుకొని ఆదర్శంగా నిలువాలని సీఎం సూచించారు. వ్యవసాయశాఖ అధికారులంతా నియంత్రిత పద్ధతిలో రైతులతో పంటసాగు చేయించే పనిలో నిమగ్నమై ఉంటారు కాబట్టి, వారికి ఇతరత్రా  పనులు అప్పగించవద్దన్నారు. ‘జిల్లాలవారీగా అగ్రికల్చర్‌ కార్డును రూపొందించాలి. ఇది ప్రతి ఏడాది జరుగాలి. పంటల మార్పిడి ఉండాలి. దానికి అనుగుణంగా కార్డు రూపొందించి, దాని ప్రకారమే పంటలను సాగుచేయాలి. పంటల వివరాలు నమోదుచేయాలి. జిల్లా, మండల, గ్రామాలవారీగా హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, కల్టివేటర్లు, పాడీ ప్లాంటేషన్‌ మిషన్లు తదితర వ్యవసాయ యంత్రాలు ఎన్ని ఉన్నాయో లెక్కతీయాలి. భవిష్యత్తులో యాంత్రీకరణ పెంచాల్సి ఉన్నందున, ఎక్కడే ఏది అవసరమో, దేనికి లోటు ఉన్నదో తెలియాలి. అన్ని జిల్లాల్లో భూసార పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయాలి. జిల్లా, డివిజన్‌, మండల, క్లస్టర్‌స్థాయి వ్యవసాయ అధికారులకు ప్రతినెలా వాహన అలవెన్సు/ప్రయాణభత్యం ఇవ్వాలి. మార్కెట్లలో వెంటనే పసుపు యార్డులు తెరిచి, క్రయ విక్రయాలు కొనసాగించాలి’ అని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. 

పక్కాగా క్రాప్‌ ఎన్యూమరేషన్‌ 

ఈ వానకాలం నుంచే రాష్ట్రంలో ఏ గుంటలో ఏ పంట వేస్తున్నారనే లెక్కలు తీయాలని సీఎం కేసీఆర్‌ అదేశించారు.  ఏఈవోలు కచ్చితమైన వివరాలు సేకరించాన్నారు. పూర్తిస్థాయిలో క్రాప్‌ ఎన్యూమరేషన్‌ జరుగాలని పేర్కొన్నారు. ‘నియంత్రిత పద్ధతిలో పంటసాగు విధానంపై అవగాహన కల్పించడానికి నాలుగైదు రోజుల్లోనే క్లస్టర్లవారీగా రైతు సదస్సులు నిర్వహించాలి. ప్రభుత్వ ఉద్దేశాన్ని.. నియంత్రిత పద్ధతిలో సాగుచేయడంవల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, డీసీఎంఎస్‌ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్లు, సింగిల్‌విండో చైర్‌పర్సన్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లను ఈ సదస్సుకు ఆహ్వానించాలి. ఏ ప్రాంతంలో ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగుచేయాలన్న విషయం ముందే నిర్ధారిస్తారు కాబట్టి, ఆ పంటలకు సరిపడా విత్తనాలను ముందే గ్రామాలకు చేర్చాలి. ఇందుకోసం విత్తనతయారీ సంస్థలతో మాట్లాడి సమన్వయం చేసుకోవాలి. విత్తనాభివృద్ధి సంస్థ ఈ విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించాలి. రైతులకు కావాల్సిన విత్తనాలను వందకు వందశాతం అందుబాటులో ఉంచాలి’ అని సీఎం సూచించారు.

సొంత ఖర్చుతో ఎర్రవల్లిలో రైతువేదిక

తన వ్యవసాయ క్షేత్రమున్న ఎర్రవల్లిలో  సొంత ఖర్చుతో రైతువేదిక నిర్మిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షా సమావేశంలో ప్రకటించారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర మంత్రులంతా తలా ఒక రైతువేదికను సొంత ఖర్చులతో నిర్మించడానికి ముందుకొచ్చారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి,  పౌరసరఫరాలసంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కొందరు జిల్లాల రైతు బంధు అధ్యక్షులు కూడా రైతువేదికలు నిర్మించడానికి ముందుకొచ్చారు. రాష్ట్రంలోని 2,602 క్లస్టర్లలో నాలుగైదు నెలల్లో రైతువేదికల నిర్మాణం పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని రైతు వేదికల్లో ఏఈవోకు కార్యాలయం, కంప్యూటర్‌, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించుకోవడానికి వీలుగా టీవీ వంటి ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. రైతువేదికలకు.. స్థలం లేదా నగదు విరాళంగా ఇచ్చిన వారు సూచించిన పేర్లు పెట్టాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

 కల్తీ వ్యాపారులు రైతు హంతకులు 

కల్తీ విత్తన వ్యాపారులు రైతు ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. వారు రైతు హంతకులు. అందుకే వారిపట్ల అధికారులు అత్యంత కఠినంగా వ్యవహరించాలి. ముఖ్యంగా పత్తి, మిర్చి విత్తనాలను కల్తీచేస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారమున్నది. అలాంటివారిని గుర్తించి పీడీ యాక్ట్‌ కింద అరెస్ట్‌చేసి జైల్లో వేయాలి. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, పోలీస్‌ అధికారులు సమన్వయంతో వ్యవహరించి కల్తీ విత్తన వ్యాపారాన్ని నూటికి నూరుశాతం అరికట్టాలి. ప్రజాప్రతినిధులెవ్వరూ కల్తీ విత్తన వ్యాపారులను కాపాడే ప్రయత్నం చెయ్యొద్దు. 

– ముఖ్యమంత్రి  కేసీఆర్‌

వలసకార్మికులకు మరిన్ని రైళ్లు

తెలంగాణ రాష్ట్రం నుంచి ఏ ఒక్క వలస కార్మికుడు కాలినడకన తన సొంత రాష్ర్టానికి వెళ్లాల్సిన దుస్థితి రాకుండా చూడాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. వలస కార్మికులు తమ సొంత ప్రాంతానికి పోవడానికి అవసరమైన రైళ్లు సమకూర్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. రైళ్లు లేని ప్రాంతాల నుంచి అవసరమైతే బస్సుల ద్వారా తరలించాలన్నారు. తమ సొంత ప్రాంతాలకు వెళ్లాలని కోరుకొనే వలస కార్మికులెవరూ నడిచిపోవాలనే ఆలోచన చేయవద్దని, తెలంగాణ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని తమ సొంత ప్రాంతాలకు తరలిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.

- Advertisement -

Latest news

Related news

ఢిల్లీపై హైదరాబాదీల విజయం

తప్పకగెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 88 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్ ని చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్...

సీఎం చేతుల మీదుగా రేపే ధరణి పోర్టల్‌ ప్రారంభం

మరో చారిత్రక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకు సీఎం కేసీఆర్‌ ..మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి గ్రామంలో ధరణి...

ప్రారంభమైన బీహర్ తొలి విడత పోలింగ్

బీహార్‌లో  తొలిదశ ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు జిల్లాల్లోని 71  శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది.  తొలివిడుత...

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...