పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలను నివర్ తుపాను వణికిస్తోంది. తెల్లవారుజామున పుదుచ్చేరి సమీపంలో తీరం దాటిన నివర్ తీవ్ర తుపానుగా మారింది. దీంతో రెండు రాష్ర్టాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తిరువణ్ణామలై, కడలూరు, విలుప్పురం, చెన్నై, కల్లకురిచ్చి,పుదుచ్చేరిలో లక్ష మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. దాదాపు 50 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ పై నివర్ ప్రభావం కనిపిస్తోంది. చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.సత్యవేడులో 340 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. తూర్పు ప్రాంతాల్లో తుఫాను ప్రభావం అధికంగా ఉండడంతో సహాయకచర్యలు చేపట్టారు. అయితే మరో మూడు రోజుల పాటు నివర్ ప్రభావం కొనసాగుతుందన్న ఐఎండీ హెచ్చరికలతో ప్రజలను అప్రమత్త చేశాయి ఆయా రాష్ర్టాలు.