28.6 C
Hyderabad
Wednesday, July 8, 2020

ప్రైవేటుకు డిస్కంలు

కేంద్రం తీసుకురావాలని భావిస్తున్న విద్యుత్‌ సవరణ బిల్లు-2020పై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అభిప్రాయాలు తెలుపాలంటూ ఇచ్చిన గడువు ముగియనే లేదు. ఈలోపే కేంద్రం తాను అనుకున్న పని చేసేసింది. కేంద్రపాలిత ప్రాంతాల్లోని విద్యుత్‌ పంపిణీ సంస్థలను ప్రైవేటీకరించనున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దీనివల్ల వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలవుతుందని, అలాగే విద్యుత్‌ పంపిణీ నిర్వహణ, ఆర్థిక సామర్థ్యం మెరుగవుతుందని చెప్పారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ విధానాన్ని అనుసరించేందుకు ఇది మోడల్‌గా ఉపయోగపడుతుందన్నారు.

విద్యుత్‌ సవరణ బిల్లు-2020 బిల్లుపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తెలియజేయడానికి కేంద్రం రాష్ర్టాలు, విద్యుత్‌ సంస్థలు, ఎన్జీవోలు, ఇతరవర్గాలకు జూన్‌ 5 వరకు గడువు ఇచ్చింది. ఈ బిల్లుపై దాదాపు అన్నిరాష్ర్టాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా డిస్కంలు మండిపడుతున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని, పార్లమెంట్‌లో అడ్డుకుంటామని ప్రకటించారు. తమిళనాడు సీఎం పళనిస్వామి విద్యుత్‌సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామంటూ ఏకంగా ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు. మరికొన్ని రాష్ర్టాలు కూడా కేంద్రానికి నేరుగా తమ వ్యతిరేకతను వ్యక్తంచేశాయి. కానీ, కేంద్రం మాత్రం డిస్కంల వ్యతిరేకతను, రాష్ర్టాల అభ్యంతరాలను పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్నది. కేంద్ర పాలిత ప్రాంతాల్లోని డిస్కంలను ప్రైవేటీకరిస్తున్నామని, దీనివల్ల విద్యుత్‌ వినియోగదారులపై పడే భారాన్ని తగ్గిస్తామంటూ కొత్త పలుకులు పలుకుతున్నది. గతంలో ఒడిశాలాంటి రాష్ర్టాల్లో విద్యుత్‌ను ప్రైవేటీకరించి చేతులు కాల్చుకున్నప్పటికీ కేంద్రం తన వైఖరిని మాత్రం బహిరంగంగానే స్పష్టంచేసింది.

కేంద్రపాలిత ప్రాంతాల్లో డిస్కంలను ప్రైవేటీకరణ చేస్తున్నట్టు ప్రకటించడం వెనుక అక్కడ పట్టణ, నగర ప్రాంతం మాత్రమే ఉండటం కారణంగా కనిపిస్తున్నది. పాండిచ్చేరి, డామన్‌ డయ్యూ, దాద్రానగర్‌ హవేళీ, చండీగఢ్‌, అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్‌లలో ఎక్కువగా పట్టణ, నగర వాతావరణమే ఉంటుంది. లఢక్‌, జమ్మూకశ్మీర్‌లో కొంత గ్రామీణప్రాంతం ఉన్నప్పటికీ.. ఆ రెండు కేంద్రం అజమాయిషీలోనే ఉంటాయి. దీంతో ఈ ప్రాంతాల్లో డిస్కంల ప్రైవేటీకరణ సులువుగా, వేగంగా పూర్తి చేయవచ్చనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ నిర్ణయాన్ని ప్రకటించిందని చెప్తున్నారు.

రాష్ర్టాల పరిస్థితి కేంద్రపాలిత ప్రాంతాలకు భిన్నంగా ఉంటుంది. రాష్ర్టాల్లో 60 నుంచి 70 శాతం వరకు గ్రామీణ ప్రాంతాలే ఉంటాయి. పైగా ఒక్కోరాష్ట్రంలో ఒక్కో రాజకీయపార్టీ అధికారంలో ఉండటంతో డిస్కంల ప్రైవేటీకరణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ప్రజలు, విద్యుత్‌ సంస్థల నుంచికూడా వ్యతిరేకత వస్తున్నది. దీంతో బిల్లు తీసుకురావడం ఆలస్యం కావచ్చనే ఉద్దేశంతోనే కేంద్రం తాజా నిర్ణయాన్ని ప్రకటించిందని చెప్తున్నారు. బిల్లుపై పార్లమెంట్‌ ఉభయసభల్లో చర్చ జరిగి.. చట్టంగా ఆమోదం పొందాలంటే ఇబ్బందికర పరిస్థితి ఉండవచ్చని ముందుగానే ఊహించిన కేంద్రం.. తమ ఆధీనంలో ఉండే కేంద్రపాలిత ప్రాంతాల్లోని డిస్కంలను ప్రైవేటీకరించే వ్యూహం అమలు చేస్తున్నట్టు పేర్కొంటున్నారు. విద్యుత్‌ సంస్థల ప్రైవేటీకరణను ముందుగా తమ ఆధీనంలో ఉండే యూటీల నుంచి మొదలుపెడితే.. రాష్ర్టాల్లోకి సులభంగా వెళ్లవచ్చని కేంద్రం అభిప్రాయంగా తెలుస్తున్నది. నిజానికి కేంద్ర పాలితప్రాంతాల్లో ఎక్కువగా పట్టణ వ్యవస్థే ఉండటంతో ప్రైవేటుకు లాభాలు అధికంగా వస్తాయి. డిస్కంలను ఢిల్లీలో ఇప్పటికే ప్రైవేటుపరం చేశారు. ఇప్పుడు మిగలిన యూటీల్లో చేస్తున్నారు. మొత్తంగా  కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటనపై దేశవ్యాప్తంగా విద్యుత్‌సంఘాల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతున్నది.

- Advertisement -

Latest news

తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోం

సొంత గడ్డకు ద్రోహం చేయడమే తెలంగాణ కాంగ్రెస్ నేతల నైజమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విషం...

Related news

తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోం

సొంత గడ్డకు ద్రోహం చేయడమే తెలంగాణ కాంగ్రెస్ నేతల నైజమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విషం...

వరుసగా ఆరో రోజు..అదే జోరు

వరుసగా ఆరో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 36వేల 743 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 22 పాయింట్లు...

కరోనా మరణాల సంఖ్య తగ్గించడంపై కేజ్రీవాల్‌ సర్కార్‌ ఫోకస్‌

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్నాయి. దీంతో కరోనా మృతుల సంఖ్యను తగ్గించడంపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గడిచిన రెండు వారాల్లో చనిపోయిన...

ఉత్తరప్రదేశ్‌ లో పెరుగుతున్న కరోనా కేసులు

ఉత్తర ప్రదేశ్‌ లో కరోనా తీవ్రత అంతకంతకు పెరగుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 1346కొత్తకేసులు వెలుగులోకి వచ్చాయి.నిన్నటికి నిన్న 18మంది మృతి చెందగా మరణాల సంఖ్య 827కు చేరింది....