28.4 C
Hyderabad
Thursday, October 29, 2020

మనజోలికి రాకుండా ఏపీకి దీటుగా జవాబునిద్దాం:సీఎం కేసీఆర్

రాష్ట్ర నీటి హక్కులను హరించేందుకు కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించాలన్నారు సీఎం కేసీఆర్. అపెక్స్ సమావేశం వేదికగా నిజాలను తేటతెల్లం చేయాలని సీఎం చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్ లో నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖకు సంబంధించిన సమగ్ర వివరాలను, కేంద్రానికి చెప్పాల్సిన అన్ని విషయాలకు సంబంధించిన వివరాలను తీసుకొని సమావేశానికి రావాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు.   

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నదీ జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రంతో కావాలనే కెలికి కయ్యం పెట్టుకుంటున్నదని సీఎం కేసీఆర్‌ చెప్పారు. అపెక్స్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వాదనలకు దీటైన సమాధానం చెప్పాలని, మళ్లీ తెలంగాణ రాష్ట్ర జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్ధలు కొట్టినట్లు స్పష్టం చేయాలన్నరు. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ నిష్క్రియా పరత్వాన్ని, ఏడు సంవత్సరాల అలసత్వాన్ని ఈ సమావేశంలో తీవ్రంగా ఎండగట్టాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. తెలంగాణ ప్రజల హక్కులను హరించడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిఘటించాలని, సమావేశం సందర్భంగా యావత్ దేశానికి నిజానిజాలను తేటతెల్లం చేయాలని సీఎం కేసీఆర్‌ తెలిపారు.  

రాష్ట్రాల పునర్విభజన చట్టాల ప్రకారం దేశంలో ఎప్పుడైనా.. కొత్త రాష్ట్రం ఏర్పడితే వెంటనే ఆ రాష్ట్రానికి నీటిని కేటాయించాలని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పడితే జూన్ 14న ప్రధాన మంత్రికి లేఖ రాశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి నీటి కేటాంయిపులు జరపాలని ఆ లేఖలో కోరినట్లు చెప్పారు. ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ 1956 సెక్షన్ 3 ప్రకారం ప్రత్యేక ట్రిబ్యునల్ వేసైనా, లేదంటే ఇప్పుడున్న ట్రిబ్యునల్ ద్వారా అయినా తెలంగాణాకు నీటి కేటాయింపులు జరపాలని కోరామన్నరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్యనైనా, లేదంటే నదీ పరివాహక ప్రాంతాల్లోని మొత్తం రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరపాలని సూచించామన్నారు. ప్రధానమంత్రికి రాసిన లేఖకు ఏడేళ్లు గడిచినా ఈనాటికి స్పందన లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఉలుకు, పలుకు లేదన్నారు.  పైగా అపెక్స్ సమావేశాల పేరిట ఏదో చేస్తున్నట్టు నటిస్తున్నారన్నరు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయడం లేదన్న సీఎం.. ఈ నెల 6 న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్రం వైఖరిని కూడా ఎండగట్టాలన్నరు. తెలంగాణాకు నీటి కేటాయింపుల విషయంలో స్పష్టత ఇవ్వాలని పట్టుపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం కోరుతున్న న్యాయమైన డిమాండ్ల విషయంలో అవసరమైన అన్ని వాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.  

- Advertisement -

Latest news

Related news

ఎమ్మెల్సీగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన క‌ల్వ‌కుంట్ల‌ క‌విత

నిజా‌మా‌బాద్‌ స్థానిక సంస్థల ఎమ్మె‌ల్సీగా కల్వ‌కుంట్ల కవిత గురు‌వారం మ‌ధ్యాహ్నం ప్రమాణం స్వీకారం చేశారు. శాస‌న‌స‌మం‌డలి దర్బార్ హాల్‌లో మధ్యాహ్నం 12.45 గంట‌లకు మండలి చైర్మన్‌ గుత్తా సుఖేం‌ద‌ర్‌‌రెడ్డి.. ఆమె...

ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

ధరణి పోర్టల్ ను సీఎం కేసీఆర్  ప్రారంభించారు. రాష్ట్ర ప్రజానీకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ధరణి పోర్టల్ నేటి నుంచి అందుబాటులోకి రాబోతున్నది. రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే...

స‌మాజ్‌వాదీ పార్టీతో ఇక ఎలాంటి పొత్తులు ఉండ‌వు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో ఎస్పీ, బీఎస్పీల మిత్రుత్వానికి ఫుల్‌ స్టాప్ ప‌డింది. స‌మాజ్‌వాదీ పార్టీతో ఇక ఎలాంటి పొత్తులు ఉండ‌వ‌ని బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి ప్ర‌క‌టించారు. గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో...

చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తోన్న భారీ వర్షాలు

భారీ వర్షాలు చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌ లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా...