18 C
Hyderabad
Friday, November 27, 2020

రాష్ట్ర రాబడిపై కరోనా ఎఫెక్ట్

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం ఆర్థిక ఇబ్బందులకు గురైంది. దానికి మన రాష్ట్రం కూడా అతీతం కాదు. కరోనా ప్రభావంతో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. 2020-21 బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష నిర్వహించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ రివ్యూలో పాల్గొన్నారు. కరోనా ప్రభావం వల్ల 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం అన్ని విధాలా కలిసి రూ. 52,750 కోట్లు తగ్గనుందని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. ఆదాయంలో భారీ తగ్గుదల నేపథ్యంలో 2020-21 బడ్జెట్ అంచనాల్లో కూడా మార్పులు, సవరణలు అనివార్యమని ప్రభుత్వానికి అధికారులు సూచించారు.

రాష్ట్రానికి పన్నుల ద్వారా, పన్నేతర మార్గాల ద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలల కాలంలో రాష్ట్రానికి 39 వేల 608 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకు 33 వేల 704 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. వాస్తవానికి రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు 15 శాతం ఉంటుందని అంచనా వేసి,  2020-21 బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించడం జరిగింది. కానీ, కరోనా వల్ల పెరగాల్సిన 15 శాతం పెరగకపోగా, గత ఏడాది వచ్చిన ఆదాయం కూడా ఈ ఏడాది రాలేదు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి పన్నుల ద్వారా, పన్నేతర మార్గాల ద్వారా మొత్తం ఒక లక్షా15 వేల 900 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనాతో బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందాయి. కానీ కేవలం 68 వేల 781 కోట్ల రూపాయలు మాత్రమే ఈ ఏడాది పూర్తయ్యే నాటికి ఆదాయం సమకూరే అవకాశాలున్నాయి. దీంతో రాష్ట్రానికి వచ్చే స్వీయ ఆదాయం 47 వేల 119 కోట్లు తగ్గనుంది.

రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా కూడా భారీగా తగ్గిందని అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.16,727 కోట్లను పన్నుల్లో రాష్ట్ర వాటాగా చెల్లిస్తామని కేంద్ర బడ్జెట్లో పేర్కొన్నారు. దీని ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు పన్నుల్లో వాటా కింద రూ. 8,363 కోట్లు రావాలి. కానీ రూ.6,339 కోట్లు మాత్రమే వచ్చాయి. పన్నుల్లో వాటా ఇప్పటికే రూ.2,025 కోట్లు తగ్గాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.16,727 కోట్లకు గాను కేవలం రూ.11,898 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. దీంతో పన్నుల్లో వాటా రూ.4,829 కోట్లు తగ్గనున్నాయని అధికారులు తెలిపారు.

అటు వివిధ ప్రాయోజిత పథకాల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి రూ.9,725 కోట్లు రావాల్సి ఉంది. దీని ప్రకారం  అక్టోబర్ నెల వరకు రూ.5,673 కోట్లు రావాలి. కానీ ఇప్పటి వరకు కేవలం రూ.4,592 కోట్లు వచ్చాయి. అక్టోబర్ మాసం వరకే రావాల్సిన నిధుల్లో రూ.1,081 కోత పడింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 9,725 కోట్ల రూపాయలకు గాను.. 8,923 కోట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయి. మొత్తంగా కేంద్ర పథకాల కింద వచ్చే నిధుల్లో 802 కోట్ల రూపాయలు కోత పడే అవకాశం ఉంది.

రాష్ట్రానికి మొత్తంగా 52 వేల 750 కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతున్నందు వల్ల దానికి అనుగుణంగా ప్రాధాన్యతా క్రమాన్ని నిర్ధారించుకుని, ఆర్థిక నిర్వహణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Latest news

Related news

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...