27.2 C
Hyderabad
Friday, December 4, 2020

లాక్‌ డౌన్‌ తో పూర్తిగా పడిపోయిన ప్రభుత్వ ఆదాయం

మిగులు రాష్ట్రంగా పేరొంది, ఆర్థికపరంగా దౌడుతీస్తున్న తెలంగాణకు కరోనా వైరస్‌ బ్రేకులు వేసింది. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి నెల ఏప్రిల్‌లో ఖజానాకు కేవలం 1700 కోట్లు మాత్రమే వచ్చాయి. మరోవైపు ఖర్చు మాత్రం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. మొదటి త్రైమాసికంలో పన్నులు, పన్నేతర రూపంలో 16 వేల కోట్ల ఆదాయమే రాగా 32 వేల 893 కోట్లు ఖర్చు అయ్యింది. ఆర్థిక కష్టాలు చుట్టుముడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా కోణంలో ఆలోచించి సంక్షేమ పథకాలను కొనసాగించింది. ఆదుకోవాల్సిన కేంద్రం మొండిచేయి చూపినా వె నుకడుగు వేయలేదు. తెచ్చిన అప్పులకు ఆరు నెలలపాటు మారటోరియం ఇప్పించమని స్వయంగా సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తిచేసినా ప్రధాని మోదీ పట్టించుకోలేదు. దీంతో ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించి మరీ రుణ వాయిదాలు చెల్లించాల్సి వచ్చింది. కేంద్రం తె లంగాణ పట్ల సవతితల్లి ప్రేమను చూపిస్తూ ఎలాంటి ఆర్థిక సహాయం చేయకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం కరోనా సంక్షోభాన్ని అధిగమిస్తున్నది. క్రమంగా ఆదాయాన్ని పెంచుకుంటున్నది. ఈ విషయాన్ని కాగ్‌ విడుదల చేసిన తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ ఆర్థిక ఏడాది తొలిమాసం ఏప్రిల్‌లో రాష్ట్ర ఖజానాకు ప్రత్యక్ష పన్నుల ద్వారా కేవలం 17 వందల కోట్లు మాత్రమే వచ్చాయి. లాక్‌డౌన్‌తో అన్ని కార్యకలాపాలు పూర్తిగా బంద్‌ కావడంతో ఆదాయం అమాంతం పడిపోయింది. లాక్‌డౌన్‌కు ముందు ముగిసిన గత ఆర్థిక సంవత్సరం చివరి నెలలో రాష్ర్టానికి ప్రత్యక్ష పన్నుల ద్వారా 9 వేల 117 కోట్ల 43 లక్షల ఆదాయం వచ్చింది. లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్‌లో ఒక్కసారిగా 1700 కోట్లకు సర్కారు ఆదాయం పడిపోయింది. లాక్‌డౌన్‌లో రాష్ట్ర ఖజానాకు రోజుకు 100 కోట్లు కూడా ఆదాయం రావడంలేదని సీఎం కేసీఆర్‌ పలుమార్లు మీడియా సమావేశాల్లో చెప్పారు. ఈ విషయం నిజమేనని ‘కాగ్‌’ త్రైమాసిక ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ మే నెలలో అత్యవసర సర్వీసుల కింద కొన్నింటికి అనుమతులు ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాకు 3682.43 కోట్ల ఆదాయం వచ్చింది. జూన్‌లో అన్‌లాక్‌ దశ మొదలు కావడంతో ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదిగా మొదలయ్యాయి. దీంతో రాష్ట్ర ఖజానాకు జూన్‌లో ప్రత్యక్ష పన్నుల ద్వారా 6,510.75 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ నాటికి ప్రత్యక్ష పన్నుల ద్వారా రాష్ర్టానికి 11,893.22 కోట్లు వచ్చింది. గత ఏడాది ఇదే కాలానికి 17,690.65 కోట్లు ఆదాయం వచ్చింది. గత ఏడాది కంటే ఈ ఏడాది తొలి త్రైమాసంలో 5,797.43 కోట్ల ఆదాయం తగ్గింది.

లాక్‌డౌన్‌ కారణంగా ఆదాయం పూర్తిగా పడిపోగా ఖర్చులు మాత్రం అమాంతంగా పెరిగిపోయాయి. లాక్‌డౌన్‌ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలు, వలస కూలీలకు ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం, కుటుంబానికి 1500 చొప్పున నగదు ఇచ్చి ఆదుకున్నది. ప్రభుత్వ దవాఖానల్లో కరోనా వైద్యసేవలు అందించింది. మరోవైపు వ్యవసాయ కార్యకలాపాలు విపరీతంగా పెరిగాయి. కరోనా కారణంగా రైతులు మార్కెట్లకు వెళ్లకుండా ప్రభుత్వమే నేరుగా వారి నుంచి ధాన్యం సేకరించాల్సి వచ్చింది. అలాగే రైతులకు సాగు పెట్టుబడి కోసం రైతుబంధు పథకం అమలుచేసింది. రైతులకు, కూలీలకు, కరోనా బాధితులకు వైద్యసేవలు, ఇతర అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 32 వేల 392 కోట్ల 48 లక్షలు ఖర్చు చేసింది. ప్రత్యక్ష పన్నుల ద్వారా 11 వేల 893 కోట్ల 22 లక్షల ఆదాయం రాగా పన్నేతర ఆదాయం 846 కోట్ల 53 లక్షలు వచ్చింది. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కంట్రిబ్యూషన్‌ ద్వారా  1970 కోట్ల 45 లక్షలు మాత్రమే వచ్చింది. దీంతో ఆపత్కాలంలో వచ్చిన ఖర్చులతో రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి విధిలేక సర్కారు 17 వేల 682 కోట్ల 28 లక్షలు అప్పు చేయాల్సి వచ్చింది. ఆ మూడు నెలల కాలంలో కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల్లో వాటా కేవలం 1868 కోట్ల 85 లక్షలు మాత్రమే వచ్చింది. ఇంతకుమించి కేంద్రం నయాపైసా కూడా కేంద్రం ఇవ్వలేదు.

కేంద్రం తెలంగాణపై తీవ్ర వివక్ష చూపింది. కరోనా నేపథ్యంలో ఆర్థికపరంగా ప్రజలకు చేయూతనిచ్చేందుకు సీఎం కేసీఆర్‌ పలు సూచనలు చేశారు. ప్రజల చేతుల్లో నగదును ఉంచేందుకు హెలికాప్టర్‌ మనీ విధానాన్ని అమలు చేయాలని చెప్పారు. తద్వారా ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయన్నారు. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు నగదు రూపంలో ఇవ్వాలని కోరారు. ఈ సూచనలను కేంద్రం పెడచెవిన పెట్టింది. కనీసం తాము చేసిన అప్పుల వాయిదాలు చెల్లించేందుకు ఆరు నెలల మారటోరియం విధించాలని సీఎం కేసీఆర్‌ కేంద్రాన్ని కోరారు. ప్రధాని దీనికి కూడా అంగీకరించలేదు. దీంతో ఆదాయం లేకున్నా ఖర్చుల కోసం తెచ్చుకున్న అప్పుల్లో నుంచే ఈ మూడు నెలల కాలానికి  3490 కోట్ల 19 లక్షలు వడ్డీ కింద చెల్లించాల్సి వచ్చింది. అన్‌లాక్‌ దశ మొదలుకావడంతో జూన్‌నెల నుంచి రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. ఆదాయం కూడా క్రమంగా పెరుగుతున్నది. మొత్తంగా అతికొద్ది కాలంలో రాష్ట్ర ఆర్థిక స్థితి సాధారణ స్థితికి చేరుకోగలదని కాగ్‌ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

- Advertisement -

Latest news

Related news

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.

కారుకు తొలివిజయం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు....