28.6 C
Hyderabad
Wednesday, July 8, 2020

విద్యుత్ చట్ట సవరణ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలి

విద్యుత్ చట్ట -2003 కు కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలను సీఎం కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు -2020పై రాష్ట్రాల అభిప్రాయాలు తెలపాలని కేంద్రం కోరిన నేపథ్యంలో.. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వపరంగా పది అంశాలతో కూడిన లేఖను రాశారు. అంశాలవారిగా జరిగే అనర్థాలను వివరించారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యుత్ సవరణ బిల్లు రాష్ట్రాల పరిధిలోని కొన్ని అధికారాలను హరిస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈఆర్సీని అపాయింట్ చేయడానికి భారత ప్రభుత్వం సెలక్షన్ కమిటీని నియమించడం, ఆ బాధ్యతలను పక్క రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కు అప్పగించడం రాజ్యాంగంలో పొందుపరిచిన సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని తేల్చిచెప్పారు. విద్యుత్ లాంటి అంశాలు రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో పొందుపరచారంటే దానర్థం ఆయా అంశాలపై కేంద్రం చట్టాలు చేయమని కాదనీ, అలా చేస్తే ఆ ప్రభావం రాష్ట్రాల కార్యకలాపాలపై నేరుగా పడుతుందని వివరించారు. ఇలాంటి ధోరణిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తేల్చిచెప్పారు.

రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించి కేంద్రం జాతీయ పునరుత్పాదక విద్యుత్ విధానాన్ని రూపొందించాలన్నారు సీఎం కేసీఆర్. కానీ అలా జరగలేదన్నారు. దేశంలోని ప్రతీ రాష్ట్రం జలవిద్యుత్తు, విండ్ పవర్, సౌర విద్యుత్ లాంటి ఉత్పాదక పద్ధతుల్లో ప్రత్యేక పరిస్థితులు కలిగి ఉంది. రాష్ట్రాలు అందుకు అనుగుణమైన నిర్ణయం తీసుకునే విధంగా న్యాయపరమైన చిక్కులు లేని ఒక విస్తృతమైన జాతీయ విధానం ఉండాలన్నారు ముఖ్యమంత్రి.

విద్యుత్ చట్ట సవరణ బిల్లు ప్రకారం దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా చేయడానికి నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ను బలోపేతం చేశారన్నారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం తెలంగాణా స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ద్వారా అమలవుతోన్న మెరిట్ ఆర్డర్ డిస్పాచ్ సంతృప్తికరంగా ఉందని చెప్పారు. గ్రిడ్ నిర్వహణలో క్రమశిక్షణ ముఖ్యమైనదే ఐనా రాష్ట్రాల థర్మల్ యూనిట్లను వెనకకు నెట్టే విధంగా ఎన్ఎల్డీసీని బలోపేతం చేయడం సరైన చర్య కాదన్నారు ముఖ్యమంత్రి. అలా జరిగితే, రాష్ట్రాల విద్యుత్ యూనిట్లు సెంట్రల్ స్టేషన్ల ఉత్పాదకతతో పోటీ పడలేవని తెలిపారు. తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేసే ఎన్టీపీసీ, ఎన్ హెచ్పీసీ లాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మెరిట్ ఆర్డర్ డిస్పాచ్ లో ఎక్కువ ప్రాధాన్యత పొందే అవకాశాలు ఉంటాయన్నారు. ఇది రాష్ట్రాల విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు నష్టదాయకమని వివరించారు. అందుకే అంతరాష్ట్ర విద్యుత్ సరఫరా వ్యవహారాన్ని ఎస్ఎల్డీసీలకే వదిలేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.

సవరణ చట్టంలో పొందుపరచినట్లు పేమెంట్స్ సెక్యూరిటీ లాంటి వాణిజ్యపరమైన అంశాల అమలు బాధ్యతను ఎన్ ఎల్డీసీకి అప్పగించకుండా, ప్రస్తుతం అమలులో ఉన్న పద్దతిలో రాష్ట్రాల రెగ్యులేటరీ కమిషన్, సివిల్ కోర్టుల పరిధిలోకి వదిలేయాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. పవర్ షెడ్యూలింగ్, గ్రిడ్ స్టెబిలిటీ లాంటి సాంకేతికపరమైన విషయాలపై ఎన్ ఎల్డీసీ దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు.

విద్యుత్ చట్ట సవరణ బిల్లు బహిరంగ ప్రాప్యతను స్వేచ్ఛగా అనుమతించాలని ప్రతిపాదిస్తోంది. ఈ సదుపాయం డిస్కమ్‌ల ఆదాయాన్ని తగ్గిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎందుకంటే ఒక మెగావాట్‌ పైగా వినియోగించే వినియోగదారులు సాంకేతిక సాధ్యత లేకుండా ఓపెన్ యాక్సెస్ కోసం వెళ్ళవచ్చన్నారు. పైగా సబ్-లైసెన్సీ ఓపెన్ యాక్సెస్ నుంచి కరెంటును తీసుకుని రిటైల్ మార్కెట్లో అమ్మవచ్చని వివరించారు. దీని వల్ల డిస్కమ్‌ల ఆర్ధిక సామర్ధ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని సీఎం కేసీఆర్ వివరించారు.

డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ రూపంలో వ్యవసాయ, గృహ వినియోగదారులకు సబ్సిడీ ప్రస్తావన సవరణ బిల్లులో ఉంది. ఇది రైతులు, పేద డొమెస్టిక్ వినియోగదారుల ఆకాంక్షలకు వ్యతిరేకమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వాలనేది తెలంగాణా ప్రభుత్వ విధానమని.. సబ్సిడీ చెల్లింపు పద్ధతిని రాష్ట్రానికే వదిలేయాలని స్పష్టం చేశారు. ఈ దిశగా చట్టంలో మార్పులు చేయడం తెలంగాణ  ప్రభుత్వానికి అభ్యంతరకరమని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు.

ప్రతిపాదిత బిల్లులో ఎలాంటి సబ్సిడీ లేకుండానే కమిషన్ వినియోగదారుల టారిఫ్ ను ఫిక్స్ చేసే ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం కమిషన్లు నిర్ణయిస్తోన్న టారిఫ్ ల్లో కొన్ని క్యాటగిరీల వినియోగదారుల క్రాస్ సబ్సిడీలు ఉన్నాయి. ప్రతిపాదిత సవరణ బిల్లు కారణంగా రైతులతో సహా అన్ని క్యాటగిరీల వినియోగదారులకు పూర్తి బిల్లులు జారీ చేయాల్సి వస్తుందని సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరకరమని స్పష్టం చేశారు. కొన్ని క్యాటగిరీల వినియోగదారులకు క్రాస్ సబ్సిడీలను అమలుచేసే విచక్షణాధికారాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పారు.

ప్రతిపాదిత చట్టం స్టేట్ రెగ్యులేటరీ కమిషన్ నియామకం వెసులుబాటును రాష్ట్రాల పరిధి నుంచి తప్పించే విధంగా ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని తేల్చిచెప్పారు. ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు ఎన్ ఫోర్స్మెంట్ అనే సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా సవరణ చట్టంలో ఉందని.. ఇది బహుళత్వంతో కూడుకున్న లిటిగేషన్లకు దారి తీస్తుందని హెచ్చరించారు. వాస్తవానికి కాంట్రాక్టులను అడ్జుడికేట్ చేసే అధికారం సివిల్ కోర్టులదేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

పది అంశాలు తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న అత్యంత బలమైన ప్రాముఖ్యాంశాలని సీఎం కేసీఆర్ లేఖ ద్వారా కేంద్రప్రభుత్వానికి తేల్చిచెప్పారు. ఈ ప్రతిపాదననలు ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యుత్ సంస్థలకు, రాష్ట్రప్రభుత్వానికి మేలు చేసేవిగా లేవని స్పష్టం చేశారు. ఇలాంటి అనర్థాలు ఉన్న పరిస్థితుల్లో ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, విద్యుత్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలన్నదే తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయమని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు.

- Advertisement -

Latest news

తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోం

సొంత గడ్డకు ద్రోహం చేయడమే తెలంగాణ కాంగ్రెస్ నేతల నైజమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విషం...

Related news

తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోం

సొంత గడ్డకు ద్రోహం చేయడమే తెలంగాణ కాంగ్రెస్ నేతల నైజమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విషం...

వరుసగా ఆరో రోజు..అదే జోరు

వరుసగా ఆరో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 36వేల 743 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 22 పాయింట్లు...

కరోనా మరణాల సంఖ్య తగ్గించడంపై కేజ్రీవాల్‌ సర్కార్‌ ఫోకస్‌

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్నాయి. దీంతో కరోనా మృతుల సంఖ్యను తగ్గించడంపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గడిచిన రెండు వారాల్లో చనిపోయిన...

ఉత్తరప్రదేశ్‌ లో పెరుగుతున్న కరోనా కేసులు

ఉత్తర ప్రదేశ్‌ లో కరోనా తీవ్రత అంతకంతకు పెరగుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 1346కొత్తకేసులు వెలుగులోకి వచ్చాయి.నిన్నటికి నిన్న 18మంది మృతి చెందగా మరణాల సంఖ్య 827కు చేరింది....