ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, ఆర్యసమాజ్ నాయకుడు స్వామి అగ్నివేశ్ శుక్రవారం కన్నుమూశారు. కొద్దిరోజులుగా కాలేయ సంబంధ అనారోగ్యంతో ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్న ఆయనకు శుక్రవారం సాయంత్రం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. దేశం నలుమూలలా జరిగిన అన్ని రకాల ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచిన స్వామి అగ్నివేశ్.. వెట్టిచాకిరి, మహిళా సమస్యలపై ప్రత్యేకంగా సుదీర్ఘ పోరాటం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి అనేక సభల్లో ప్రసంగించారు.
స్వామి అగ్నివేశ్ 1939 సెప్టెంబర్ 21న శ్రీకాకుళంలో జన్మించారు. ఆయన అసలు పేరు వేపా శ్యామ్‌రావ్. నాలుగేండ్ల వయసులోనే తండ్రిని కోల్పోయారు. న్యాయ, ఆర్థికశాస్ర్తాల్లో పట్టాలు సాధించి కోల్‌కతాలోని సెయింట్ జేవియర్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన సవ్యసాచి ముఖర్జీ న్యాయవాదిగా ఉన్నప్పుడు అగ్నివేశ్ ఆయన కింద జూనియర్‌గా పనిచేశారు. చిన్న వయసులోనే ప్రజా ఉద్యమాల వైపు ఆకర్షితుడైన అగ్నివేశ్ 1968లో ఆర్యసమాజ్‌లో చేరి సన్యాసం స్వీకరించారు. 1970లో ఆర్యసభను స్థాపించారు. 1977లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1979లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అప్పుడే 1981లో వెట్టిచాకిరీ నిర్మూలన కోసం ‘బాండెడ్ లేబర్ లిబరేషన్ ఫ్రంట్’ను ఏర్పాటు చేశారు. ఢిల్లీ చుట్టుపక్కల క్వారీల్లో బానిసలుగా మగ్గుతున్న ఎంతోమందికి విముక్తి కల్పించారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని బానిసత్వ నిర్మూలన ట్రస్టుకు 1994 నుంచి 2004 వరకు చైర్‌పర్సన్‌గా కొనసాగారు. అటు స్వామి అగ్నివేశ్ మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఆయన మొదటి నుంచీ మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. ఉద్యమ సందర్భంలో జరిగిన అనేక సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు.
స్వామి అగ్నివేశ్ తెలంగాణ ఉద్యమానికి తొలి నుంచి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని జాతీయ, అంతర్జాతీయ వేదికలపై బలంగా వాదించారు. నాటి ఉద్యమ సారథి నేటి తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తదితరులతో సుధీర్ఘంగా తెలంగాణ ఉద్యమంపై చర్చించిన జాతీయస్థాయి నాయకుల్లో అగ్నివేశ్ ఒకరు. 2003 ఏప్రిల్ 27న వరంగల్‌లో జరిగిన టీఆర్ఎస్ వార్షికోత్సవ సభకు మాజీ ప్రధాని దేవెగౌడతో కలిసి వచ్చి లక్షల మంది ప్రజల సమక్షంలో తెలంగాణ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. 2010లో వరంగల్‌లో టీఆర్ఎస్ నిర్వహించిన తెలంగాణ మహాగర్జన సభలో కూడా పాల్గొన్నారు