28.3 C
Hyderabad
Wednesday, February 24, 2021

కష్టాలకోర్చి సీఆర్పీఎఫ్ జవాన్ గా ఎంపికైన పద్మ

సీఆర్‌పీఎఫ్‌లో జవానుగా ఉద్యోగం రావడం అంటే ఆషామాషీ కాదు. అలాంటిది అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఆదర్శనగర్ నగర్ కాలనీకి చెందిన నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన గజ్జెల పద్మ సీఆర్‌పీఎఫ్‌ మహిళా జవానుగా ఎంపికైంది. పేదరికం లక్ష్యానికి అడ్డుకాదని నిరూపించిన పద్మ.. ఆదిలాబాద్‌ జిల్లా నుంచి సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌గా ఎంపికైన తొలి మహిళగా ఘనత సాధించి ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

కష్టాలు ఎదురైనా.. లక్ష్యం మర్చిపోలే

గజ్జెల పద్మ తండ్రి గజ్జల రాములు అనారోగ్యంతో చనిపోతే తల్లి లక్ష్మీ కూలీపని చేస్తు కుటుంబాన్ని పోషిచింది. అన్న జగదీశ్ బతుకుదెరువు కోసం దుబయ్‌ పోయిండు. ఇంట్లో తల్లి, వదినలు అందించిన అండతో పద్మ ముందడుగు వేసింది.  నిరుపేద కుటుంబంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ పద్మ డిగ్రీ పూర్తి చేసింది. చిన్ననాటి నుంచే భద్రతా దళాల్లో చేరి దేశ సేవ చేయాలనే లక్ష్యం పెట్టుకున్న పద్మ.. ఆ దిశగా ప్రయత్నించింది.

కుటుంబ కష్టాలను తీర్చాలని..

పేదరికం ఎంత బాధించినా.. పద్మ ఏనాడూ చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఎలాగైనా పోలీసుశాఖలో ఉద్యోగం సాధించి కుటుంబ కష్టాలను తీర్చాలనుకుంది. డిగ్రీ అయినంక పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమైంది. పోలీస్ కానిస్టేబుల్‌ పరీక్షలో ఎదురైనా ఓటమి పద్మలో మరింత పట్టుదలను పెంచింది. దాంతో స్టేట్ పోలీస్ సెలక్షన్స్ కంటే ఎంతో టఫ్ గా ఉండే సీఆర్పీఎఫ్ లో జాబ్ కొట్టాలని టార్గెట్ గా పెట్టుకుంది.

ఏ సదుపాయామూ లేకపోయినా..

సీఆర్పీఎఫ్ లో జాబ్ రావాలంటే మాటలు కాదు. ఫిట్ నెస్ బాగుండాలి. అందుకే పద్మ ఫిట్నెస్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఉదయం నాలుగింటికే లేచి రన్నింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టేది. గ్రామంలో ఏ సదుపాయామూ లేకపోయినా.. శ్రమకోర్చి మెరుగైన ఫిట్‌నెస్ సాధించింది. మూడేళ్లపాటు చేసిన కఠోర సాధన ఫలితం ఇచ్చింది. సీఆర్పీఎఫ్ ఫిజికల్ టెస్టులో అత్యున్నత ప్రతిభను కనబర్చిన పద్మ.. మెడికల్ టెస్టులోనూ క్వాలిఫై అయింది. రాత్రింబవళ్లు కష్టపడి చదివి రాతపరీక్షలోనూ విజయం సాధించింది. సీఆర్పీఎఫ్ లేడీ జవాన్ గా పద్మ సెలక్ట్ అయి చరిత్ర సృష్టించింది.

- Advertisement -

Latest news

Related news