29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

స్వచ్ఛ సర్వేక్షణ్ లో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలి.. మంత్రి హరీశ్ రావు

దేశంలోని నగరాల సరసన సిద్దిపేట మున్సిపాలిటీని మొదటి వరుసలో నిలుపుదామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్  లో భాగంగా సిద్ధిపేట అంబేద్కర్ సర్కిల్ లో జెండా ఊపి 2కే రన్ ని ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, రఘోత్తం రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. అనంతరం సిద్ధిపేట పాత బస్టాండ్ సర్కిల్ నుంచి ముస్తాబాద్ చౌరస్తా వరకు నిర్వహించిన 2కే రన్ లో హరీశ్ పాల్గొన్నారు. తర్వాత నిర్వహించిన కార్యక్రమంలో హరీశ్ మాట్లాడారు. స్వచ్ఛ సర్వేక్షణ్-2021 కార్యక్రమ సన్నాహకంగా సిద్దిపేటలో ‘నేను సైతం.. నా సిద్ధిపేట పట్టణం కోసం’  2కే రన్ నిర్వహించినట్లు హరీశ్ రావు చెప్పారు. సిద్దిపేట అంటే శుద్దిపేటగా మార్చేందుకు ప్రతి రోజు మూడు రకాల చెత్తను వేర్వేరు చేస్తూ ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రజలకు సూచించారు.

అందరూ స్వచ్ఛ సర్వేక్షణ్ లో పాల్గొని.. స్వచ్ఛ సర్వేక్షణ్ ఫీడ్ బ్యాక్ ని ఇచ్చి స్కోర్ పెంచి దేశంలో ప్రథమ స్థానంలో సిద్ధిపేటను నిలపాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో సిద్ధిపేట నెంబరు వన్ గా నిలవాలని, ఇవాళ రాత్రి సిద్ధిపేట స్టేడియంలో డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ నిర్వహించుకొంటున్నట్లు గుర్తుచేశారు.  ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ సిద్ధిపేట పట్టణం సాధ్యమని హరీశ్ వెల్లడించారు.  స్వచ్ఛ 2కే రన్ లో పాల్గొని విజేతలుగా నిలిచిన జి.సాయికృష్ణ, జి.కిషోర్, డి. శ్రీకాంత్, ఈశ్వర్, చైతన్య, రమ్య, మౌనిక, కృతిక లకు మంత్రి బహుమతులు అందజేశారు.

మహాత్మాగాంధీ స్ఫూర్తితో స్వచ్ఛ తెలంగాణ సాధించి, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సిద్ధిపేట సాధించే లక్ష్యంతో కృషి చేస్తానని బోర్డుపై సంతకంతో కూడిన ప్రతిజ్ఞకు మంత్రి హరీశ్ రావు మొదటి సంతకం చేశారు. తర్వాత ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, రఘోత్తం రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఏఏంసీ చైర్మన్ పాలసాయిరాం, మున్సిపల్ కమిషనర్ రమణాచారి సంతకం చేశారు.

- Advertisement -

Latest news

Related news