29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

వేపచెట్టు కొట్టినందుకు.. వేలల్లో ఫైన్

ఇల్లు కట్టుకోవాలంటే ఖుల్ల జాగ కావాలె. పిల్లర్లు పోశి.. గోడలు కట్టినంక తలుపులకు, కిటికీలకు చెక్కలు కావాలె. ఇంటికెవర్ర సుట్టాలొస్తే.. వాళ్లు కూసోనీకె కుర్చీలు, సోఫాలు గావాలె. కానీ.. ఇంటి ముంగట మాత్రం చెట్టు ఉండొద్దు. ఇల్లు కట్టనీకె అడ్డమొస్తుందని.. ఎన్నో ఏండ్లకెళ్లి పెరుగుతున్న భారీ వేపచెట్టును హైదరాబాద్ లోని కనికరం లేకుండా కొట్టేశిర్రు. ఈ విషయం తెల్సుకున్న ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు.. చెట్టును కొట్టినోళ్లకు.. అదిరిపోయేలా ఫైన్ వేశిర్రు.


పాతబస్తీ పరిధిలోని సైదాబాద్ ల ఇల్లు కట్టనీకె అడ్డమొస్తుందని దాదాపు 40 ఏండ్ల వయసున్న వేపచెట్టుకు రాత్రికి రాత్రే నరికేశిర్రు. దాని జాడ కూడా తెల్వకుండా.. వేప మొద్దులు దాపెట్టి.. వేర్లతో సహా చెట్టును సమూలంగా ఖతం పెట్టేందుకు తల్గవెట్టాలని చూశిర్రు. కానీ.. ఇదంతా ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ పిలగాడు చూశిండు. ఆ చెట్టు కింద ఆడుకున్న ప్రేమనో, చెట్టును కొట్టేస్తున్నరన్న బాధనో ఆ పిలగాని మనసును కదిలిచ్చినట్టుంది. వెంటనే.. ఇంట్ల ఉన్న ఫోన్ తీసుకొని 1800 425 5364 నెంబర్ కు ఫోన్ చేశిండు. అది.. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ టోల్ ఫ్రీ నెంబరన్నట్టు. సార్.. నేను గ్రీన్ బ్రిగేడియర్ ని. మా ఇంటి ముంగట పెద్ద వేపచెట్టును కొట్టేస్తున్నరు. మీరు వాళ్ల మీద చర్యలు తీస్కోవాలె అని కోరిండు.

పిలగాని ఫోన్ కాల్ కు స్పందించిన ఫారెస్ట్ ఆఫీసర్లు విచారణ చేశిర్రు. అధికారుల అనుమతులు లేకుండా.. భారీ చెట్టును నరకడం నేరం అని తేల్చి.. చెట్టు కొట్టినందుకు కారకులకు రూ.62,075 జుర్మానా విధించి.. ముక్కు పిండి, అక్కడిక్కడే వసూలు చేశిర్రు. వయసుల శిన్నోడే అయినా.. ఆ పిలగాడు చేశిన పెద్దపనికి ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ పెద్ద సార్లంతా శెభాష్ రా బుడ్డోడా.. నీ అసంటోళ్లే పచ్చదనాన్ని కాపాడే పర్యావరణ రక్షకులు అని మెచ్చుకున్నరట. నిజంగా.. అన్ని రోజులు సల్లటి గాలినిచ్చి.. ఎండలవడి వస్తే.. నీడనిచ్చి కూసోనీకె ఇంత జాగనిచ్చిన చెట్టును కొట్టేసుడు కరెక్టు కాదు కదా. మీరు కూడా ఇప్పటికెల్లి ఏడనన్న పర్మిషన్ లేకుండ చెట్లు కొట్టుడు చూస్తే.. జప్పన ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చెయ్యిర్రి. పచ్చదనాన్ని కాపాడుకునే జిమ్మేదారి మనందరి మీద ఉన్నది కదా!

- Advertisement -

Latest news

Related news