జీహెచ్ఎంసీ మేయర్ గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన మోతె శ్రీలతారెడ్డి, ప్రమాణస్వీకారం చేసిన కార్పోరేటర్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నగర అభివృద్ధికి పాటు పడాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరానికి అనేక అనుకూలతలున్నాయని.. దీన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్దే బాధ్యత మేయర్, డిప్యూటీ మేయర్, కార్పోరేటర్ల చేతుల్లో ఉందని సీఎం అన్నారు. భిన్న సంస్కృతులు, విభిన్న సంప్రదాయాలున్న నగరం హైదరాబాద్ అని.. వివిధ ప్రాంతాల ప్రజలు ఇక్కడ జీవిస్తున్నారని.. హైదరాబాద్ అంటే మినీ ఇండియా అని ఆయన అన్నారు.
పదవిలో ఉన్నవారు సంయమనంతో, సాదాసీదాగా ఉండాలని సూచించారు. బస్తీల్లో ఉండే పేదల ఇబ్బందులు, సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రజలతో మమేకమై పని చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. నగరాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నదని సీఎం తెలిపారు. చాలా కొద్దిమందికి మాత్రమే ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యే అవకాశం వస్తుంది. ప్రజలు ఇచ్చిన ఆ అవకాశాన్ని అదృష్టంగా భావించి.. ప్రజాసేవ చేయాలని మేయర్, డిప్యూటీ మేయర్, కార్పోరేటర్లకు సీఎం సూచించారు.
