తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన(ఈడబ్ల్యూఎస్) వారికి 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.
విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అమలవుతున్న రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగున్నాయి. వీటితోపాటు ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. దీంతో తెలంగాణలో రిజర్వేషన్లు 60 శాతానికి చేరుకోనున్నాయి.
అగ్రవర్ణ పేదలకు ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో 103 వ రాజ్యాంగ సవరణ ద్వారా పదిశాతం రిజర్వేషన్లు కల్పించింది. 19 రాష్ర్టాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఈ చట్టాన్ని ఇప్పటికే అమలు చేస్తుండగా.. సీఎం కేసీఆర్ ఆమోదంతో తెలంగాణలో కూడా అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి.