రైతులను సంఘటితం చేసేందుకే రైతు వేదికలను నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో తన తాతయ్య-నానమ్మ పేరిట సొంత నిధులతో నిర్మించిన రైతు వేదికను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతు వేదికల్లో అంతర్జాతీయ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. రైతు వేదికల నుంచి నేరుగా విస్తరణాధికారులతో మాట్లాడొచ్చని చెప్పారు. గతంలో గోదాముల సామర్థ్యం 4 లక్షల మెట్రిక్ టన్నుల మాత్రమే కాగా.. ప్రస్తుతం 25 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచామని కేటీఆర్ వెల్లడించారు.
కేంద్రంలో బీజేపీ అమలు చేస్తున్న కిసాన్ నమ్మాన్ నిధి పథకానికి మన రైతుబంధు పథకమే స్ఫూర్తి అని, దేశంలో రైతులకు పెట్టుబడి ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కేటీఆర్ గుర్తుచేశారు. సాగుకు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ అన్నదాత జీవితాల్లో వెలుగు నింపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి చెప్పారని.. నా తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణి అని కేసీఆర్ నిరూపించారని కేటీఆర్ చెప్పారు.