ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు గుడ్న్యూస్ చెప్పింది. ప్రమోషన్ల కోసం ఉద్యోగుల కనీస సర్వీస్ కుదించారు. మూడు నుంచి రెండేళ్లకు కుదిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్వీస్ కుదింపు దస్త్రంపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. తగినంత అనుభవం లేకపోవడంతో పదోన్నతులు పొందలేకపోతున్న ఉద్యోగులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఊరట లభించింది. ఏ ఉద్యోగికైనా ఒక కేటగిరీ నుంచిపై కేటగిరీకి పదోన్నతి పొందాలంటే ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉండాల్సిన కనీస సర్వీసు.. మూడేళ్లు. ఇప్పుడు దీనిని రెండేళ్లకు పరిమితం చేశారు. తద్వారా, రెండేళ్ల సర్వీసు ఉన్నా ఇకనుంచి పదోన్నతికి అర్హులవుతారు. తదుపరి పదోన్నతికి కావాల్సిన రెండేళ్ల సర్వీసును ప్రస్తుతమున్న కొలువులో సదరు ఉద్యోగి చేరిన నాటి నుంచి.. మళ్లీ డీపీసీని నిర్వహించే తేదీకి మధ్య కాలంలో పరిగణనలోకి తీసుకుంటారు.