సేద్యం బాగుంటే సమాజం బాగుంటదన్న ఉద్దేశంతో సీఎం కేసీఅర్ వ్యవసాయానికి చేయూతనిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. పంటలకు మద్దతు ధర నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం. అది కేంద్రం చేతుల్లోనే ఉంటుందన్నారు. కొత్త వ్యవసాయ చట్టంతో రైతులు పండించిన పంటలకు లాభం జరుగుతదని బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ కొత్త వ్యవసాయ చట్టం ప్రకారం కొనుగోలు కేంద్రాలు ఉండవని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ రైతులకు నీళ్లు, రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు అందించి పంటలసాగుకు సహకరిస్తున్నారన్నారు. రైతులు పండించిన పంటలకు మంచి ధర ఇచ్చి కేంద్రం రైతులకు లాభం చేకూర్చాలి అని మంత్రి పేర్కొన్నారు.
గజ్వేల్‌లోని స్థానిక మార్కెట్ యార్డులో నిర్మించ తలపెట్టిన భూసార పరీక్ష కేంద్రానికి మంత్రి హరీశ్‌రావు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. ప్రపంచానికి అన్నం పెట్టేది రైతన్నలన్నారు. రైతులోకానికి అవసరమైన సమగ్ర సమాచారం అందించేందుకే రైతువేదికలు ఉపయోగపడుతాయన్నారు. వ్యవసాయ సూచనలు, ఎరువులు, పురుగుమందులు దశలవారీగా రైతువేదికల ద్వారా అందించనున్నట్లు తెలిపారు. భూసార పరీక్షలు చేయించి రైతులకు సమగ్ర సమాచారంతో భూరికార్డులు అందజేస్తామని చెప్పారు. రైతుల విజయగాధలను రైతువేదికల ద్వారా రైతులందరికీ తెలియచేస్తామన్నారు.