కార్తీకమాసం చివరి సోమవారం కావడం వల్ల తెలంగాణలోని శైవక్షేత్రాలు భక్తులతో కళకళలాడాయి. వేములవాడ, వేయి స్తంభాలగుడి, కొమురవెల్లి, చెరువుగట్టు, కీసర, తెలంగాణ జిల్లాల్లోని పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. వేములవాడ రాజన్న ఆలయం ఓం నమశ్శివాయ అంటూ శివనామస్మరణతో మారుమోగింది. కొమురవెల్లి మల్లన్నకు భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి వారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల తాకిడి పెరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు భక్తిశ్రద్ధలతో దీపారాధన చేశారు. భద్రాచలం గోదావరి తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి.. కార్తీక దీపాలు వదిలారు. గోదావరి ఒడ్డున ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో దీపాలు వెలిగించారు.
కార్తికమాసం చివరిరోజు, చివరి సోమవారం కావడం వల్ల ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైల క్షేత్రానికి కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉచిత దర్శనానికి 4 గంటలు, శీఘ్ర దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శ్రీశైల ఆలయ పుష్కరిణి వద్ద సాయంత్రం లక్ష దీపోత్సవం నిర్వహించనున్నట్టు ఆలయ నిర్వాహకులు, అధికారులు తెలిపారు.